Gujarat cabinet reshuffle : గుజరాత్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా, ఆయన మంత్రివర్గంలోని సహచరులంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేస్తూ, వారంతా తమ పదవులను త్యజించారు. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు కొత్త మంత్రివర్గం కొలువుదీరనుండగా, ఈ ఆకస్మిక మార్పు వెనుక ఉన్న వ్యూహమేంటి? ఎవరికి దక్కనుంది మంత్రి పదవి?
అసలేం జరిగిందంటే : గత కొన్ని రోజులుగా గుజరాత్ మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి తెరదించుతూ, గురువారం మధ్యాహ్నం మంత్రులంతా తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రికి సమర్పించారు.
కొత్త వారికి అవకాశం: మంత్రివర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి, కొత్త ముఖాలకు, యువతకు అవకాశం కల్పించాలన్న బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకే ఈ మార్పు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కొత్త అధ్యక్షుడి నియామకం తర్వాతే : ఇటీవల గుజరాత్ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రస్తుత మంత్రి జగదీష్ విశ్వకర్మ నియామకమయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత, పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా మార్పులు చేయాలని అధిష్ఠానం భావించింది. ఈ క్రమంలోనే, పూర్తిస్థాయి మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది.
రేపే ప్రమాణ స్వీకారం : కొత్త మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం, శుక్రవారం ఉదయం 11:30 గంటలకు గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో జరగనుంది. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, కొత్త మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు. ఈ పునర్‌వ్యవస్థీకరణలో పలువురు సీనియర్ మంత్రులను పక్కనపెట్టి, పూర్తిగా కొత్తవారికి అవకాశం కల్పించనున్నట్లు బీజేపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
రాబోయే ఎన్నికలను, పార్టీ భవిష్యత్ నాయకత్వాన్ని దృష్టిలో ఉంచుకునే బీజేపీ అధిష్ఠానం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


