Gujarat Election 2022 : గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. 19 జిల్లాల వ్యాప్తంగా 89 నియోజకవర్గాల పరిధిలో గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగింది. 5 తరువాత ఎవ్వరిని పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదు. అయితే.. సమయాని కంటే ముందుగానే పలు పోలింగ్ బూత్‌లలో క్యూ లైన్లలో ఉన్నవారికి మాత్రం ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. సాయంత్రం 5 గంటల వరకు 56.88 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడం, చెదరుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాతంగా కొనసాగింది. తుది పోలింగ్ ఎంత అనేది ఇంకా అధికారులు వెల్లడించలేదు.
మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 718 మంది పురుష అభ్యర్థులు, 70 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గట్లొదియ నుంచి పోటీ చేస్తుండగా, ఆప్ సీఎం అభ్యర్ధి ఇసుదన్ గధ్వి ఖంబలియ నుంచి బీజేపీ నేత హార్ధిక్ పటేల్ విరంగాం నుంచి రివాబా జడేజా జామ్‌నగర్ (నార్త్) నుంచి తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
క్రికెటర్ రవీంద్ర జడేజా, ఆయన భార్య జామ్‌నగర్ బీజేపీ అభ్యర్ధి అయిన రివాబా జడేజా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర మంత్రులు పురుషోత్తమ్ రూపాలా, మందతా సిన్హ్, గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ, గుజరాత్ సీనియర్ మంత్రి సీఆర్ పాటిల్, కాంగ్రెస్ సీనియర్ అర్జున్ మొడ్వాడియా తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.