Gujarat Renewable Energy : ఒకప్పుడు అదొక పగటి కల అనుకున్నారు.. ప్రయోగం అని కొట్టిపారేశారు. కానీ నేడు అదే ఆ రాష్ట్రానికి బ్రహ్మాస్త్రంగా మారింది. దేశం మొత్తం చీకటిని చీల్చే వెలుగు రేఖగా నిలిచింది. ప్రధాని మోదీ 2000 నాటి విజన్ ఇప్పుడు వాస్తవరూపం దాల్చి, గుజరాత్‌ను దేశంలోనే ‘రెన్యూవబుల్ ఎనర్జీ’ (పునరుత్పాదక ఇంధన) రారాజుగా నిలబెట్టింది. గుజరాత్ కేవలం వర్తమానంలోనే కాదు, భవిష్యత్తులోనూ ఇంధన రంగానికి దిక్సూచిగా మారనుందని స్వయంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ ప్రకటించారు.
ప్రయోగం నుంచి ప్రగతి వైపు.. మోదీ విజన్ : బుధవారం జరిగిన రెన్యూవబుల్ ఎనర్జీ కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీ ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2000-2002 ప్రాంతంలోనే క్లీన్ ఎనర్జీకి పునాదులు వేశారు. అప్పట్లో పునరుత్పాదక విద్యుత్ అంటే అందరూ ఒక ప్రయోగంగానే చూశారు. కొందరు జోకులు కూడా వేశారు. కానీ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఆనాడు ఒక జోక్ అనుకున్నదే.. నేడు గుజరాత్ శక్తిగా మారింది. మా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది” అని సంఘ్వీ గర్వంగా వెల్లడించారు. బలమైన నిర్ణయాలు తీసుకోవడంలో గుజరాత్ ఎప్పుడూ ముందే ఉంటుందని, అందుకే ఈ రోజు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
నమ్మలేని నిజాలు.. అబ్బురపరిచే గణాంకాలు : గుజరాత్ సాధించిన ప్రగతిని వివరించడానికి సంఘ్వీ అధికారిక గణాంకాలను ఉటంకించారు.
పవన విద్యుత్ (Wind Energy): భారతదేశ మొత్తం పవన విద్యుత్ ఉత్పత్తిలో గుజరాత్ వాటా ఏకంగా 27.2 శాతంగా ఉంది.
గ్రీన్ ఎనర్జీ వినియోగం: రాష్ట్రంలో వినియోగించే మొత్తం విద్యుత్తులో 64 శాతానికి పైగా పునరుత్పాదక వనరుల నుంచే వస్తోంది.
రూఫ్ టాప్ సోలార్: ఇంటింటికీ సోలార్ అనే నినాదాన్ని గుజరాత్ నిజం చేసింది. రాష్ట్రంలో 7.5 లక్షల ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న రూఫ్ టాప్ సోలార్లలో ఇది 30 శాతానికి సమానం.
తయారీ, ఇన్‌స్టాలేషన్, పరిశోధన.. ఇలా అన్ని విభాగాల్లోనూ గుజరాత్ ఒక బలమైన ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేసిందని ఆయన వివరించారు.
కచ్ గాధ.. పారిశ్రామిక వృద్ధి : 2001 భూకంపం తర్వాత కచ్ ప్రాంతం ఎలా కోలుకుందో వివరిస్తూ, గుజరాత్ పారిశ్రామిక దృఢత్వాన్ని సంఘ్వీ కొనియాడారు. “గుజరాత్‌లో పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుంది. ఇక్కడ పరిశ్రమలు సాధిస్తున్న వృద్ధి రేటు, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సాటిలేనిది” అని ఆయన పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చారు.
లక్ష్యం: గ్లోబల్ లీడర్ కావాలి : ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో ఉన్నా, తాము ఇంతటితో సంతృప్తి చెందబోమని సంఘ్వీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నాయకత్వంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త పాలసీలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల దిగ్గజాలు, పరిశోధకులు, స్టార్టప్‌లు ప్రభుత్వంతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు.
ఇండియా-ఈయూ ఒప్పందం: కొత్త అవకాశాలు : ఇటీవల అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రాధాన్యత పెరుగుతోందని, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో గుజరాత్ పెవిలియన్ గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని చాటిచెప్పిందని సంఘ్వీ గుర్తుచేశారు. “భారత్-యూరోపియన్ యూనియన్ (India-EU) వాణిజ్య ఒప్పందం గుజరాత్ పరిశ్రమలకు కొత్త ద్వారాలు తెరుస్తుంది. జాతీయ తయారీ రంగంలో గుజరాత్ వాటాను ప్రస్తుతం ఉన్న 18 శాతం నుంచి 25 శాతానికి పెంచడమే మా లక్ష్యం. కష్టపడి పనిచేస్తే మనకు అవకాశాలకు కొదవ ఉండదు” అని ఆయన ముగించారు.

