Gwalior Ambedkar statue controversy : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం చుట్టూ వివాదం రాజుకుని, మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరం గ్వాలియర్ అట్టుడుకుతోంది. అంబేడ్కర్ మద్దతుదారులు భారీ నిరసనకు పిలుపునివ్వడంతో, నగరం పోలీస్ కోటగా మారిపోయింది. వేలాది మంది పోలీసులు కవాతు చేస్తూ, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అసలు ఒక విగ్రహం ఏర్పాటు ఇంతటి ఉద్రిక్తతకు ఎందుకు దారితీసింది…? న్యాయవాదుల మధ్య మొదలైన ఈ వివాదం, నగరాన్నే స్తంభింపజేసే స్థాయికి ఎలా చేరింది..?
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరాన్ని అంబేడ్కర్ విగ్రహ వివాదం కుదిపేసింది. ఆరు నెలల క్రితం గ్వాలియర్ హైకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనతో ఈ వివాదానికి బీజం పడింది. ఓ వర్గం న్యాయవాదులు విగ్రహ ఏర్పాటును సమర్థించగా, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు సహా మరో వర్గం న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. న్యాయస్థానం ప్రాంగణంలో మొదలైన ఈ అభిప్రాయ భేదం, క్రమంగా నగర శాంతిభద్రతలకు సవాలుగా మారింది.
వివాదానికి ఆజ్యం పోసిన వ్యాఖ్యలు : న్యాయవాదుల మధ్య ఉన్న ఈ వివాదంలోకి రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ప్రవేశించడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. విగ్రహ ప్రతిష్ఠకు అనుకూలంగా, వ్యతిరేకంగా పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులతో వాతావరణం వేడెక్కింది. ఇంతలో, బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు, న్యాయవాది అనిల్ మిశ్రా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహించిన అంబేడ్కర్ మద్దతుదారులు, ఆజాద్ సమాజ్ పార్టీ, భీమ్ ఆర్మీ సహా పలు దళిత సంఘాలు అక్టోబర్ 15న గ్వాలియర్‌లో భారీ ఆందోళనలకు పిలుపునిచ్చాయి.
పోలీసుల కట్టుదిట్టమైన భద్రత : నిరసనల పిలుపుతో అప్రమత్తమైన గ్వాలియర్ యంత్రాంగం, నగరాన్ని తమ పూర్తి అధీనంలోకి తీసుకుంది. గతంలో ఏప్రిల్ 2న జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది.
4,000 మంది బలగాలు: నగరవ్యాప్తంగా 4,000 మందికి పైగా పోలీసులను మోహరించారు. ఇతర జిల్లాల నుంచి అదనంగా మరో 800 మంది భద్రతా సిబ్బందిని రప్పించారు.
నగర దిగ్బంధం: గ్వాలియర్‌లోని 50కి పైగా కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, నగరంలోకి వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ప్రత్యేక నిఘా: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు అనిల్ మిశ్రా ఇంటి వద్ద 50 మంది పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. సమీప భవనాలపై నుంచి కూడా పరిస్థితిని పర్యవేక్షించారు.
పాఠశాలలకు సెలవు: ఉద్రిక్తతల నేపథ్యంలో బుధవారం నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ భద్రత, పోలీసుల చర్చలతో పలు సంస్థలు తమ నిరసనలపై వెనక్కి తగ్గాయి.
“గ్వాలియర్‌లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. శాంతిభద్రతల పరిరక్షణకు మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం. ప్రజల దైనందిన కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం, ప్రజలు కూడా సహకరించాలి,” అని గ్వాలియర్ సీఎస్పీ హీనా ఖాన్ తెలిపారు.


