Hardik Pandya Watch Price : మంగళవారం నుంచి ఆసియాకప్ 2025 ప్రారంభం కానుండటంతో క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ అంతకంటే ముందే టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ఓవార్త చక్కర్లు కొడుతోంది. ఆయన విలాసవంతమైన జీవన విధానంపై నెట్టింట్లో చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఓ ప్రాక్టీస్ సెషన్‌లో పాండ్య ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గడియారాల్లో ఒకటైన రిచర్డ్ మిల్లె RM 27-04 ను ఆయన ధరించడాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇండియన్ హోరోలజీ కథనం ప్రకారం.. దీని ధర అక్షరాలా రూ.20 కోట్లు ఉంటుందని అంచనా. ఈ విషయంపై నెట్టింట్లో హాట్ హాట్గా చర్చ నడుస్తోంది. ఎందుకంటే, ఈ ఏడాది ఆసియా కప్ గెలిచిన జట్టుకు కేవలం రూ.2.6 కోట్లు మాత్రమే ప్రైజ్‌మనీ దక్కనుంది. అంటే ఆసియాకప్‌లో విజేతగా నిలిచిన జట్టు కంటే కూడా హార్దిక్ ధరించిన వాచ్ ధర దాదాపు 10 రెట్లు ఎక్కువ అని అర్థమవుతోంది. ఇంత ఖరీదైన వాచ్ ధరించడంపై నెట్టింట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రిచర్డ్ మిల్లే వాచ్ ప్రత్యేకతలివే..
రిచర్డ్ మిల్లే RM 27-04 సాధారణమైన వాచ్ కాదు. దీనిని తొలుత స్టార్ టెన్నిస్ ఆటగాడు రాఫెల్ నాదెల్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది చాలా తేలికగా ఆకర్శనీయంగా ఉంటుంది. ఈ వాచ్ బరువు కేవలం 30 గ్రాములు మాత్రమేనని తెలుస్తోంది. క్రీడాకారులకు ఎంతో సౌకర్యంగా ఉండే ఈ వాచ్‌లు.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంతకు మించి కంపెనీ తయారు చేయలేదని తెలుస్తోంది. ఈ యూనిక్ వాచ్‌కు 12000 G ఫోర్స్ కంటే ఎక్కువ స్ట్రెస్ లెవల్స్‌ను తట్టుకునే సామర్థ్యం ఉంటుంది.
పాక్ ఆటగాళ్ల జీతాలతో పోలిస్తే చాలా ఎక్కువ..
హార్దిక్ పాండ్యా వాచ్ ధర ఆసియా కప్‌కు ఎంపికైన పాకిస్థాన్ ఆటగాళ్ల వార్షిక జీతం కంటే చాలా ఎక్కువ. ఆసియా కప్ కు పాకిస్థాన్ 17 మంది ఆటగాళ్లను సెలెక్ట్ చేయగా.. వీరిలో అబ్రార్ అహ్మద్, ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, సల్మాన్ అఘా, షాహీన్ అఫ్రిది, సామ్ అయూబ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరికి రూ. 1,69,02,540 మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా, ఏడుగురు ఆటగాళ్ల జీతం మొత్తం రూ.11,83,17,780 మాత్రమే అవుతుంది.
మరో 6 వికెట్లు తీస్తే అరుదైన రికార్డు..
కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరుపున హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు 114 మ్యాచ్‌లు ఆడాడు. 27.9 సగటుతో 1812 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో 94 వికెట్లు పడగొట్టాడు. 4/16 రన్‌రేటుతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఆసియాకప్ 2025లో పాండ్యా మరో 6 వికెట్లు సాధిస్తే టీ20 క్రికెట్ చరిత్రలో 100 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలుస్తాడు. ఇప్పటి వరకు భారత జట్టుకు చెందిన ఏ బౌలర్ కూడా టీ20లో 100 వికెట్లు సాధించలేదు. ఈ ఘనత సాధించనున్న ఏకైక భారత బౌలర్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్నాడు.


