Haryana police officer suicide investigation : హరియాణా పోలీసు శాఖను కుదిపేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి బలవన్మరణం కేసులో మరో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ కేసును దర్యాప్తు చేస్తున్న కీలక అధికారి, ఏఎస్సై సందీప్‌కుమార్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనతో ఆగ్రహించిన ఆయన కుటుంబసభ్యులు, న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు జరపబోమని భీష్మించుకు కూర్చున్నారు. అసలు దర్యాప్తు అధికారే ఎందుకిలా ప్రాణాలు తీసుకున్నాడు..? ఆయన కుటుంబం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆ ఉన్నతాధికారి ఎవరు..? ఈ రెండు ఆత్మహత్యల మధ్య ఉన్న సంబంధం ఏంటి?
సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషిస్తున్న రోహ్‌తక్ జిల్లా సైబర్ విభాగ ఏఎస్సై సందీప్‌కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన స్వగ్రామమైన జింద్ జిల్లా జూలానాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి కారణమైన వారిని శిక్షించే వరకు, తమకు న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు. సందీప్ మృతదేహాన్ని ప్రస్తుతం రోహ్‌తక్‌లోని వారి నివాసానికి తరలించారు.
ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేయాలంటూ పట్టు : సందీప్ మరణానికి ఐఏఎస్ అధికారి అమనీత్ పి. కుమార్ కారణమని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు, ఆమెను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సందీప్ సుమారు ఏడాదిగా రోహ్‌తక్ సైబర్ సెల్‌లో పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఆయన తన మామ ఇంట్లో ఉంటూ రోజూ విధులకు హాజరవుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. న్యాయం లభించకపోతే ఎంతవరకైనా పోరాడతామని, బుధవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు.
దేశభక్తి, సేవాభావం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సందీప్ తాత భరత్ సింగ్ సైన్యంలో, తండ్రి దయానంద్ పోలీస్ శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. వారి స్ఫూర్తితోనే 2007లో సందీప్ పోలీసు ఉద్యోగంలో చేరారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె నీట్ పరీక్షకు సిద్ధమవుతుండగా, చిన్న కుమార్తె 9వ తరగతి, కుమారుడు 4వ తరగతి చదువుతున్నారు. యువకుడిగా ఉన్నప్పుడు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం వంటివి నిర్వహించేవారని స్థానికులు గుర్తుచేసుకున్నారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/former-goa-cm-ravi-naik-passes-away-at-79/
అసలేంటీ కేసు? రెండు ఆత్మహత్యల వెనుక ఉన్న కథేంటి? : 2001 బ్యాచ్ హరియాణా క్యాడర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఇటీవల తన నివాసంలో కుల వివక్ష, ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. తన సూసైడ్ నోట్‌లో ఎనిమిది మంది అధికారుల పేర్లను ఆయన ప్రస్తావించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి డీజీపీ శత్రుజీత్ కపూర్‌ను ప్రభుత్వం సెలవుపై పంపింది.
ఈ కేసులో భాగంగా, పూరన్ కుమార్ పేరిట ఓ మద్యం వ్యాపారి నుంచి రూ.2.5 లక్షలు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై హెడ్ కానిస్టేబుల్ సుశీల్ కుమార్‌ను ఇటీవల అరెస్ట్ చేశారు. ఈ లంచం కేసును ఏఎస్సై సందీప్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. “నిజాలు వెలుగులోకి తీసుకురావడానికే నా జీవితాన్ని త్యాగం చేస్తున్నాను” అని పేర్కొని సందీప్ బలవన్మరణానికి పాల్పడటం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.


