Haryana IPS officer suicide case : ఓ ఉన్నత ఐపీఎస్ అధికారి ఆత్మహత్య హరియాణా రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఉన్నతాధికారుల వేధింపులే కారణమన్న ఆరోపణలు, రాష్ట్ర డీజీపీనే ప్రధాన సూత్రధారిగా కుటుంబం ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో, డీజీపీని 48 గంటల్లో తొలగించకపోతే ఏకంగా 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేస్తామంటూ దళిత సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. అసలేం జరిగింది..? తెలుగు గడ్డకు చెందిన ఆ ఐపీఎస్ అధికారి బలవన్మరణానికి దారితీసిన పరిస్థితులేంటి..?
హరియాణా సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పూరన్ కుమార్ (52) బలవన్మరణం రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆయన ప్రాణాలు తీసుకున్నారని ఆరోపిస్తూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ కపూర్‌ను 48 గంటల్లోగా పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, హరియాణా మరియు చండీగఢ్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వాల్మీకి సామాజానికి చెందిన సుమారు 5 లక్షల మంది ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని హెచ్చరించారు. ఈ మేరకు చండీగఢ్‌లో 31 మంది సభ్యులతో కూడిన కమిటీ ‘మహా పంచాయతీ’ నిర్వహించి ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
భార్య ఫిర్యాదు.. ప్రభుత్వం చర్యలు : మరోవైపు, తన భర్త మృతికి రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్, రోహతక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాల వేధింపులే కారణమని ఆరోపిస్తూ పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారిణి అయిన అమ్నీత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీకి కూడా లేఖ రాశారు. ఈ ఫిర్యాదుతో ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాను బదిలీ చేసింది. ఈ కేసులో దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
జాతీయ స్థాయిలో స్పందన : ఈ ఘటనపై జాతీయ స్థాయిలోనూ తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఐఏఎస్ అమ్నీత్‌కు లేఖ రాస్తూ తన మద్దతు తెలిపారు. “సామాజిక అసమానతలు, వివక్షను ఎదుర్కొంటూ పూరన్ కుమార్ వంటి అధికారి ప్రాణాలు తీసుకోవడం అత్యంత దురదృష్టకరం. ప్రజల బాధలు తీర్చాల్సిన అధికారులనే మనం రక్షించలేకపోవడం సిగ్గుచేటు,” అని ఖర్గే తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. హరియాణా గవర్నర్ ప్రొఫెసర్ ఆషీమ్ కుమార్ ఘోష్ కూడా పూరన్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.
ఎవరీ పూరన్ కుమార్ : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పూరన్ కుమార్, 2001 బ్యాచ్ హరియాణా క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన అక్టోబర్ 7న చండీగఢ్‌లోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆయన భార్య అమ్నీత్ కుమార్, ముఖ్యమంత్రితో కలిసి అధికారిక పర్యటనపై జపాన్‌లో ఉన్నారు. ఇటీవల పూరన్ కుమార్ అధికారుల హక్కుల గురించి బహిరంగంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన్ను పోలీస్ ట్రైనింగ్ కళాశాల ఐజీగా ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేయడం గమనార్హం.


