Saturday, November 15, 2025
Homeనేషనల్Haryana Police Crisis : హరియాణా పోలీసు శాఖలో పెను సంచలనం - అధికారి సూసైడ్...

Haryana Police Crisis : హరియాణా పోలీసు శాఖలో పెను సంచలనం – అధికారి సూసైడ్ కేసులో మరో అధికారి ఆత్మహత్య!

Haryana Police suicide cases : ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుండగానే, అదే కేసులో ఊహించని, వింత మలుపు చోటుచేసుకుంది. మరణించిన ఐపీఎస్ అధికారిపై ఉన్న అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న మరో పోలీస్ అధికారి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం హరియాణా పోలీసు శాఖను ఉలిక్కిపడేలా చేసింది. అంతకన్నా విస్తుపోయే విషయం ఏమిటంటే, తన చావుకు ఆ మరణించిన ఐపీఎస్ అధికారే కారణమంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొనడం! అసలేం జరుగుతోంది హరియాణా పోలీసు శాఖలో..? ఒకరి మరణానికి, మరొకరి ఆత్మహత్యకు ఉన్న చిక్కుముడి ఏంటి..?

- Advertisement -

హరియాణా పోలీసు శాఖలో వరుస ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఉదంతం సృష్టించిన అలజడి సద్దుమణగక ముందే, ఈ కేసు దర్యాప్తులో మరో విషాదం చోటుచేసుకుంది. పూరన్ కుమార్‌పై ఉన్న అవినీతి ఆరోపణల కేసును విచారిస్తున్న అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) సందీప్ లాఠర్, రోహ్‌తక్‌లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన పూరన్ కుమార్ ఆత్మహత్య కేసును మరింత జఠిలం చేసింది.

వింత మలుపు తిప్పిన సూసైడ్ నోట్: ఏఎస్ఐ సందీప్ లాఠర్ ఘటనాస్థలంలో మూడు పేజీల సూసైడ్ నోట్, ఒక వీడియో సందేశాన్ని విడిచిపెట్టారు. ఇందులో ఆయన తన ఆత్మహత్యకు, ఇటీవల మరణించిన ఐపీఎస్ అధికారి పూరన్ కుమారే కారణమని పేర్కొనడం పెను సంచలనంగా మారింది. పూరన్ కుమార్ ఒక “అవినీతిపరుడని”, ఆయనపై తనవద్ద బలమైన ఆధారాలున్నాయని సందీప్ ఆరోపించారు. అరెస్టు అవుతానన్న భయంతోనే పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని, తన ఆత్మహత్య “అవినీతి వ్యవస్థపై చేస్తున్న బలిదానం” అని సందీప్ తన నోట్‌లో పేర్కొన్నట్లు సమాచారం.

అసలేంటీ పూరన్ కుమార్ కేసు : కొద్ది రోజుల క్రితం, అక్టోబర్ 7న, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) ర్యాంకు అధికారి అయిన వై. పూరన్ కుమార్, చండీగఢ్‌లోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన లేఖలో, హరియాణా డీజీపీ శత్రుజీత్ కపూర్‌తో సహా 16 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తనను కులం పేరుతో వేధించారని, అవమానించారని, వారి ఒత్తిడి తట్టుకోలేకే చనిపోతున్నానని ఆరోపించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ కేసులో దళిత అధికారి అయిన పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారిణి అమనీత్ ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఒత్తిళ్లు పెరగడంతో హరియాణా డీజీపీ శత్రుజీత్ కపూర్‌ను ప్రభుత్వం సెలవుపై పంపింది.

రెండు ఆత్మహత్యల మధ్య చిక్కుముడి: ఒకవైపు సీనియర్ అధికారులు తనను వేధించారని ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకుంటే, మరోవైపు ఆ పూరన్ కుమారే అవినీతిపరుడని, ఆయన వల్లే తాను చనిపోతున్నానని ఏఎస్ఐ సందీప్ లాఠర్ ఆత్మహత్య చేసుకోవడం పోలీసు శాఖను గందరగోళంలో పడేసింది. ఏఎస్ఐ సందీప్, పూరన్ కుమార్ గన్‌మెన్‌పై ఉన్న వసూళ్ల ఆరోపణల కేసును విచారిస్తున్న బృందంలో సభ్యుడని తెలుస్తోంది. ఈ వరుస పరిణామాలతో హరియాణా పోలీసు శాఖలోని అంతర్గత విభేదాలు, ఒత్తిళ్లపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు ఏఎస్ఐ సందీప్ రాసిన లేఖను, వీడియోను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad