Haryana : తెల్లవారుజామున లేచి చదువుకుంటే బాగా గుర్తు ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అయితే.. ఎంత మంది విద్యార్థులు తెల్లవారుజామున నిద్ర లేచి చదువుతున్నారు..? ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చిన తరువాత మాత్రమే పిల్లల చేత చదివించగలరు. మరీ ఇంటి దగ్గర చదివించే బాధ్యత తల్లిదండ్రులదే అని అంటుంటారు. అయితే.. ఇకపై ఇలా కుదరదు అని అంటుంది హర్యానా ప్రభుత్వం. ఉదయాన్నే విద్యార్థులను లేపి చదివించే బాధ్యతను అటు తల్లిదండ్రులతో పాటు ఇటు ఉపాధ్యాయులపైనా పెట్టింది. ఇదంతా రానున్న పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అని చెబుతోంది.
అలారం పెట్టుకుని నిద్ర లేచే వారు చాలా అరుదు. ఎందుకంటే అలారం రాగానే దాన్ని ఆఫ్ చేసి పడుకుండిపోతుంటారు. దీనికి ప్రభుత్వం ఓ సొల్యూషన్ కనిపెట్టింది. 10,12 తరగతి విద్యార్థులు త్వరగా లేచి చదువుకుని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా చూడాలంటూ ఆలయాలు, మసీదులు, గురుద్వారాలను కోరింది. ఉదయాన్నే మైకుల ద్వారా విద్యార్థులను నిద్ర లేపేందుకు సహకరించాలని సూచించింది.
విద్యార్థులను 4.30గంటలకు నిద్రలేపి పరీక్షలకు సన్నద్దం చేయాలని తల్లిదండ్రులను విద్యాశాఖ కోరింది. ఇందుకోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించింది. ఉదయం పూట చదువుకునేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాహనాల శబ్ధాలు సైతం ఉండదు. చదువుకునేందుకు ఇంత కంటే ప్రశాంతమైన సమయం దొరకదు. అందుకనే విద్యార్థులను ఉదయం 4.30 గంటలకే నిద్ర లేపేలా వారి తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మాట్లాడాలి. 5.15 గంటల కల్లా విద్యార్థులు చదుకునేందుకు కూర్చోనేలా ప్రొత్సహించాలి. విద్యార్థులు లేచారా లేదా అన్న విషయాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలుసుకోవాలి. ఒకవేళ తల్లిదండ్రులు సహకరించకుంటే ఆ విషయాన్ని పాఠశాల మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకురావాలి. ఇక పంచాయతీలు కూడా తెల్లవారుజామున ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలని ఆదేశించింది.
ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు లౌడ్ స్పీకర్ల ద్వారా తెల్లవారుజామునే ప్రకటనలు చేయడం ద్వారా విద్యార్థులు లేచి చదువుకుంటారు. దీని వల్ల ప్రతి విద్యార్థినికి రెండు, మూడు గంటల అదనపు సమయం లభిస్తుందని సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అన్షాజ్ సింగ్ చెప్పారు. ఇక పరీక్షలకు 70 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటి నుంచి వీటిని పాటిస్తూ ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేయాలని అన్షాజ్ సింగ్ ప్రభుత్వ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, జిల్లా విద్యాశాఖ అధికారులకు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.