Women donate jewelry for Punjab flood relief : ప్రకృతి ప్రకోపానికి పంజాబ్ విలవిల్లాడుతోంది. 37 ఏళ్లలో ఎన్నడూ చూడని జల ప్రళయం ఆ రాష్ట్రాన్ని ముంచెత్తింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు, పంట పొలాలు నీట మునిగాయి, పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ కష్టకాలంలో, కట్టుబట్టలతో మిగిలిన బాధితులను ఆదుకోవడానికి మానవత్వం ముందుకొచ్చింది. దేశం నలుమూలల నుంచి సాయం వెల్లువెత్తుతోంది. కానీ, హరియాణాలోని ఓ కుగ్రామానికి చెందిన మహిళలు, ఓ నాలుగో తరగతి చిన్నారి చేసిన త్యాగం ఇప్పుడు అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. కష్టంలో ఉన్న తోటివారి కోసం వారు ఏకంగా తమ బంగారు, వెండి ఆభరణాలనే విరాళంగా ఇచ్చి తమ పెద్ద మనసును చాటుకున్నారు. అసలు ఎవరా మహిళలు..? వారిని అంతగా కదిలించిన అంశం ఏంటి..?
మనవరాలి పెళ్లికి దాచింది.. పంజాబ్ ప్రజలకు ఇచ్చింది : హరియాణాలోని నుహ్ జిల్లా, మేవాట్ ప్రాంతంలోని గ్రామస్థులు పంజాబ్ వరద బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. గత ఐదు రోజులుగా విరాళాలు సేకరించి, దుప్పట్లు, ఆహార పదార్థాలు వంటివి ట్రక్కుల కొద్దీ పంపిస్తున్నారు. ఈ క్రమంలో, తలక్‌పురి గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు రహీమి చేసిన పని అందరినీ కదిలించింది.
వెండి గాజుల దానం: ఆమె తన చేతికున్న వెండి గాజులను తీసి విరాళంగా ఇచ్చేసింది. “ఈ గాజులను నా మనవరాలి పెళ్లికి ఇద్దామని దాచుకున్నాను. కానీ, ఇప్పుడు పెళ్లి కంటే పంజాబ్ ప్రజల ప్రాణాలు ముఖ్యం. వారికి ఇప్పుడు నా సహాయం అవసరం,” అని ఆమె చెప్పిన మాటలు అక్కడున్న వారి కంటతడి పెట్టించాయి.
వృద్ధుల త్యాగం.. రూ.5 లక్షల విలువైన ఆభరణాలు : రహీమి స్ఫూర్తితో, అదే ప్రాంతానికి చెందిన 70-80 ఏళ్ల వయసున్న మరికొందరు వృద్ధ మహిళలు కూడా ముందుకు వచ్చారు. వారంతా కలిసి సుమారు 2 కిలోల వెండి, 20 గ్రాముల బంగారం (సుమారు రూ.5 లక్షల విలువైనవి) ఆభరణాలను పంజాబ్ బాధితుల కోసం విరాళంగా అందించారు. ఈ గ్రామస్థుల ఉదారతను నుహ్ డిప్యూటీ కమిషనర్ అకిల్ పిలానీ ప్రత్యేకంగా ప్రశంసించారు.
సైకిల్ కలను త్యాగం చేసిన చిన్నారి : ఉత్తరాఖండ్‌లో మరో హృద్యమైన ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే ఉమేశ్ కుమార్, పంజాబ్ బాధితుల కోసం విరాళాలు సేకరిస్తుండగా, సహదీప్ కౌర్ అనే నాలుగో తరగతి చిన్నారి చేసిన పని అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.
పిగ్గీ బ్యాంక్ మొత్తం ఇచ్చేసింది: సహదీప్, గత మూడేళ్లుగా సైకిల్ కొనుక్కోవాలనే కల కోసం తన పిగ్గీ బ్యాంక్‌లో డబ్బులు దాచుకుంటోంది. ఎమ్మెల్యే విరాళాల కోసం రాగానే, ఆ చిన్నారి ఏమాత్రం ఆలోచించకుండా, తన పిగ్గీ బ్యాంక్‌లో దాచుకున్న డబ్బులన్నింటినీ తీసి ఆయన చేతిలో పెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఆ చిన్నారి పెద్ద మనసును నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ సంఘటనలు, ఆపద సమయంలో కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా, మానవత్వం ఎలా పరిమళిస్తుందో చెప్పడానికి నిలువుటద్దంలా నిలుస్తున్నాయి. వీరి నిస్వార్థ సేవ ఎందరికో స్ఫూర్తినిస్తోంది.


