Dragon Fruit Green Tea Blend : టీ.. మనలో చాలా మందికి రోజువారీ జీవితంలో భాగం. ఉదయం లేవగానే వేడివేడి టీ తాగనిదే చాలా మందికి రోజు గడవదు. గ్రీన్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ.. ఇలా ఎన్నో రకాలు మనకు తెలుసు. కానీ, ఇప్పుడు వీటన్నింటికీ భిన్నంగా, చూడగానే కట్టిపడేసే రంగుతో, తాగితే అద్భుతమైన రుచితో, ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక కొత్తరకం టీ మన ముందుకు వచ్చింది. అదే ‘పింక్ టీ’. అసలు ఈ పింక్ టీ కథేంటి…? దీనిని ఎలా తయారు చేస్తారు..? కిలో పొడి ధర ఎంత..?
అసోం అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది తేయాకు తోటలు. రెండు శతాబ్దాలుగా టీ ఉత్పత్తికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న అసోం నుంచి ఇప్పుడు ఒక వినూత్న ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. దులియాజన్‌లోని మధుటింగ్‌కు చెందిన దిపెన్ గొగోయ్ అనే ఓ సాధారణ రైతు చేసిన అద్భుత ప్రయోగమే ఈ “పింక్ టీ”. ఎలాంటి రసాయనాలు, కృత్రిమ రంగులు లేకుండా కేవలం రెండే రెండు సహజమైన పదార్థాలతో ఆయన ఈ హెల్దీ డ్రింక్‌ను సృష్టించారు.
ఆలోచన ఎలా పుట్టింది..?
సంవత్సరాలుగా తన పొలంలో గ్రీన్ టీ, ఆర్థడాక్స్ టీ (సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసే టీ) పండిస్తున్న దిపెన్ గొగోయ్‌కు ఓ రోజు అనుకోకుండా ఓ వినూత్న ఆలోచన తట్టింది. తాను రోజూ తాగే గ్రీన్ టీలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్‌ను కలిపారు. అంతే, ఆ టీ రంగు, రుచి పూర్తిగా మారిపోయి, చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా తయారైంది. ఆ క్షణమే తన మనసులో “పింక్ టీ” తయారీ ఆలోచన బీజం పడిందని గొగోయ్ ఆనందంగా చెబుతారు. డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే సహజమైన గులాబీ రంగు, పోషకాలు, గ్రీన్ టీలోని ఆరోగ్య గుణాలను మేళవించి ఈ ప్రత్యేకమైన టీని ఆయన రూపొందించారు.
ఆరోగ్య ప్రయోజనాలు అనేకం : ఈ పింక్ టీ కేవలం రంగు, రుచికి మాత్రమే పరిమితం కాలేదు. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని గొగోయ్ ధీమాగా చెబుతున్నారు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది.
మధుమేహులకు ప్రయోజనకారి: డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
చర్మ, కంటి ఆరోగ్యం: చర్మ సౌందర్యాన్ని పెంచడంతో పాటు, కంటి చూపును కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ధర ఎక్కువే.. అయినా డిమాండ్ తగ్గట్లేదు : ఈ పింక్ టీ ప్రత్యేకత, ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా దీనికి మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది. కేవలం 50 గ్రాముల పింక్ టీ పొడితో 50 కప్పుల వరకు టీ తయారు చేసుకోవచ్చని, దీని ధర రూ. 250 అని గొగోయ్ తెలిపారు. అంటే, కిలో పింక్ టీ పొడి ధర ఏకంగా రూ. 5,000 పలుకుతోంది. ధర కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ, దీనికి ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదని ఆయన అంటున్నారు. అసోం టీ ఉత్పత్తి 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ప్రబాహిని’ అనే వేదికగా ఈ ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. గొగోయ్ మాట్లాడుతూ, దిల్లీ, ముంబై వంటి పెద్ద నగరాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయని, కొరియర్ల సాయంతో దేశం నలుమూలలకూ డెలివరీ చేస్తున్నామని పేర్కొన్నారు.


