Himachal Pradesh Floods: హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మండి జిల్లాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఏకధాటిగా కుండపోత వర్షం కురుస్తుంది. ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. ఈ వరదలతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వర్షపు తీవ్రతకు రోడ్లు దెబ్బతిన్నాయి, వాహనాలు కొట్టుకుపోయాయి. వరదతో ఏర్పాటైన బురదలో కొన్ని వాహనాలు కూరుకుపోయాయి.
కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 19.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్షాల వల్ల మండి జిల్లాలో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. అధికారుల సమాచారం మేరకు ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు వరదల్లో కొట్టుకుపోయారు. అలాగే భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపారు. ముఖ్యంగా జైల్ రోడ్, జోనల్ హాస్పిటల్ రోడ్, సైంజ్ రీజియన్ వంటి ప్రాంతాల్లో వరద ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.
Readmore: https://teluguprabha.net/national-news/amit-shah-akhilesh-yadav-operation-mahadev-lok-sabha/
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్, మండి డిప్యూటీ కమిషనర్ లు పర్యటించారు. ఆ ప్రాంతాలలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షితంగా రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మండి జిల్లాలోని సదర్ ప్రాంతంలో విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.
Readmore: https://teluguprabha.net/national-news/tcs-layoffs-12000-employees-it-ministry-intervention/
ఇక వర్షాల ప్రభావంతో కొండచరియలు విరిగిపడటంతో పఠాన్ కోట్ – మండి జాతీయ రహదారి, కిరాత్పూర్ – మనాలి నాలుగు లేన్ల రహదారి, చండీగఢ్ – మనాలి హైవేలు మూతపడ్డాయి. ఈ మార్గాల్లో ట్రాఫిక్ పునరుద్ధరణ కోసం అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. ఈ భారీ వర్షాలకు బియాస్, సుకేటి, సకోడి నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నదుల పరీవాహక ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.


