Substandard Helmet Crackdown: ద్విచక్ర వాహనదారుడి భద్రతపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించింది. నాసిరకం హెల్మెట్ల తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని హెల్మెట్ల వల్ల ప్రాణ నష్టం జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మీ ప్రాణాలకు రక్షణ కల్పించే ఈ హెల్మెట్ల నాణ్యతపై కేంద్రం తీసుకున్న కఠిన చర్యలు, వాటి వెనుక ఉన్న వాస్తవాలు, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ఏమిటి? వివరంగా తెలుసుకుందాం.
నాసిరకం హెల్మెట్లపై కేంద్రం కొరడా, ఎందుకు ఈ చర్యలు :
మన దేశంలో ద్విచక్ర వాహనాల సంఖ్య 21 కోట్లకు పైగా ఉంది. ఇంత పెద్ద సంఖ్యలో వాహనదారులు ఉన్నప్పుడు, వారి భద్రతకు సంబంధించి హెల్మెట్ల నాణ్యత అత్యంత ప్రధానమైన అంశం. మోటార్ వాహనాల చట్టం-1998 ప్రకారం హెల్మెట్ ధరించడం తప్పనిసరి అయినప్పటికీ, చాలా మంది నాసిరకం హెల్మెట్లను ఉపయోగించడం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు పక్కన అమ్ముడవుతున్న తక్కువ నాణ్యత గల హెల్మెట్లు రోడ్డు ప్రమాదాల్లో మరణాలకు ప్రధాన కారణమవుతున్నాయని కేంద్రం గుర్తించింది. అందులో భాగంగా, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) తీసుకున్న నిర్ణయాలు
కఠిన చర్యలకు ఆదేశం:
సరైన ప్రమాణాలు పాటించకుండా నాసిరకం హెల్మెట్లను తయారు చేసే సంస్థలు, అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
BIS ఆమోదం తప్పనిసరి:
BIS ఆమోదం పొందిన హెల్మెట్లను మాత్రమే వాడాలని వినియోగదారుల మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రజలను కోరింది. BIS సర్టిఫికేషన్ లేకుండా హెల్మెట్ల ఉత్పత్తి చేసి విక్రయం చేసే వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
నిరంతర తనిఖీలు:
ప్రమాణాలు పాటించేలా చూసేందుకు BIS నిరంతరం పరిశ్రమలు, దుకాణాల్లో తనిఖీలు చేపడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 500 హెల్మెట్ శాంపిళ్లను టెస్ట్ చేయగా, 30కి పైగా తనిఖీలు, సీజ్ ఆపరేషన్లు చేపట్టారు.
లైసెన్సుల రద్దు:
ఒక్క దిల్లీలోనే 2,500 నాసిరకం హెల్మెట్లను సీజ్ చేయగా, ఏకంగా 9 తయారీ సంస్థల లైసెన్సులను రద్దు చేయడం ఈ చర్యల తీవ్రతను తెలియజేస్తుంది. జూన్ 2025 నాటికి 176 సంస్థలు BIS సర్టిఫికెట్ పొందినట్లు BIS తెలిపింది.
జిల్లా కలెక్టర్లకు లేఖలు:
నాసిరకం హెల్మెట్లపై దృష్టి సారించేలా దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు వినియోగదారుల మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖలు కలిసి పనిచేయాలని, BIS అధికారులు వీరికి సహకరించాలని సూచించింది.
కొత్త ద్విచక్ర వాహనాలకు రెండు హెల్మెట్లు తప్పనిసరి:
ఇటీవలే కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త స్కూటర్ లేదా బైక్ కొనుగోలు చేసినవారికి డీలర్ రెండు ISI సర్టిఫికేట్ పొందిన హెల్మెట్‌లను అందించేలా నిబంధనలు రూపొందించింది. ఇది వినియోగదారులకు నాణ్యమైన హెల్మెట్లను అందించడంతో పాటు, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో.. భారతదేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాద దృష్ట్యా ఈ చర్య తప్పనిసరని పేర్కొన్నారు.
ప్రమాదాల గణాంకాలు – హెల్మెట్ ప్రాముఖ్యత:
ఏటా మన దేశంలో దాదాపు 4,80,000 ప్రమాదాలు సంభవిస్తుండగా, అందులో 1,88,000 మరణాలు నమోదవుతున్నాయి. వాటిలో 69,000 కంటే ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాలకు సంబంధించినవే కావడం విశేషం. హెల్మెట్ వాడకం రోడ్డు ప్రమాదాలను నిరోధించడంలో అత్యంత ప్రభావవం చూపిస్తదని రోడ్డు భద్రతా నిపుణులు వివరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, హెల్మెట్‌లను సరిగ్గా ఉపయోగించడం వల్ల మరణ ప్రమాదాన్ని 40 శాతం, తీవ్రమైన గాయాల ప్రమాదాన్ని దాదాపు 70 శాతం తగ్గించొచ్చు.