Hemant Soren| జార్ఖండ్(Jharkhand) అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని కూటమి ఈనెల 26న కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మరోసారి సీఎంగా హేమంత్ సోరెన్(Hemant Soren) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తదితర కీలక నేతలు పాల్గొననున్నారు.
కాగా 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి 56 స్థానాలతో భారీ విజయాన్ని అందుకుంది. జేఎంఎం 34 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు, ఆర్జేడీ 4 సీట్లు, సీపీఐ (ఎంఎల్) రెండు స్థానాల్లో విజయం సాధించాయి. ఇక బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీఏ(NDA) కూటమి కేవలం 24 సీట్లకే పరిమితమైంది.