High alert in Hyderabad due to Bomb Blast In Delhi: దేశ రాజధాని ఢిల్లీ ఉగ్ర దాడి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొద్ది సేపటి క్రితం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ 1 వద్ద పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఓ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం మేరకు పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఎర్రకోట గేట్ నెంబర్ 1 సమీపంలోని మెట్రో స్టేషన్ పార్కింగ్ దగ్గర ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాంబు స్క్వాడ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హై అలెర్ట్ నెలకొంది. పేలుడు నేపథ్యంలో ఎర్రకోటతో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. పేలుడు ధాటికి చుట్టుపక్కనే ఉన్న పలు కార్లు, ద్విచక్ర వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో ఉగ్రవాదులు పేల్చి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఢిల్లీ పేలుళ్లతో హైదరాబాద్‌లో హై అలర్ట్..
దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా.. హైదరాబాద్‌తో లింకులు బయటపడుతున్నాయి. గతంలో జరిగిన ఉగ్రదాడుల్లోనూ హైదరాబాద్ లింకులు బయటపడ్డాయి. ఉగ్రవాదులు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అనేక దర్యాప్తుల్లో తేలింది. తాజా, ఢిల్లీ బాంబు పేలుళ్లలోనూ హైదరాబాద్ లింకులపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఢిల్లీతో సహా హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఆయా నగరాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. కేంద్రం అలర్ట్‌తో ప్రధాన నగరాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పేలుడుపై స్పందించిన ఢిల్లీ పోలీసులు.. ఉగ్రవాద చర్యలను తోసిపుచ్చలేమంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే రాజధాని నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఉన్నప్పటికీ ఉగ్రచర్య నేపథ్యంలో భద్రతను మరింతగా పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించింది. అనుమానిత వ్యక్తులు, అనుమానిత వస్తువులు, వాహనాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగర సీపీ సజ్జనార్ సూచించారు. గుంపులు గుంపులుగా తిరగవద్దని వీలైనంత వరకు ప్రజలు ఇంటికే పరిమితం కావడం మంచిదని సూచించారు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు మిగతా ప్రాంతాల్లోనూ తనిఖీలు పెంచారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోని పాతబస్తీలో విస్తృత తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించాలని నగర సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ ఉన్నతాధికారులు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కీలక ఆదేశాలిచ్చారు.


