Gujarat High Court Comments on Divorce: ఈ రోజుల్లో భార్యాభర్తలు పెళ్లైన కొన్ని నెలలకే విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలకు గురై తమ వివాహ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. ఒకరి అభిప్రాయాన్ని, ఇష్టాలను మరొకరు గౌరవించలేకపోవడం, ఆధిపత్యం చెలాయించడం వంటి కారణాలతో జీవిత భాగస్వామితో అడ్జస్ట్ కాలేకపోతున్నారు. తాజాగా, గుజరాత్‌లోనూ అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఈ విషయంలో హైకోర్టు సైతం బాధితుడి నిర్ణయాన్ని సమర్థిస్తూ విడాకులు మంజూరు చేయడం ఆలోచింపజేస్తోంది.
ఇంట్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి తినకూడదని నిషేధించడంతో గుజరాత్ జంట వివాహ బంధం ముగిసిన ఘటన చర్చనీయాంశమైంది. అంతేకాకుండా భార్య ప్రవర్తనను ‘మానసిక క్రూరత్వం’గా పేర్కొంటూ దిగువ కోర్టు విడాకుల నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.
మానసిక ఒత్తిడి
పూర్తి వివరాల ప్రకారం.. గుజరాత్‌కి చెందిన దంపతుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం వారి దాంపత్య జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. ఇంట్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి ఎప్పుడూ వండకూడదని తన భార్య నిబంధన పెట్టిందని.. అంతేకాకుండా, తన మతపరమైన ఆచారాల ప్రకారం జీవించాలని బలవంతం చేస్తోందని భర్త కోర్టును ఆశ్రయించాడు. ఈ సమస్య కేవలం ఆహారం గురించి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత జీవితంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా ప్రభావితం చేస్తోందని తెలిపాడు. తన భార్య ప్రవర్తన తనను మానసిక ఒత్తిడికి గురిచేస్తోందని కోర్టులో ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read: https://teluguprabha.net/telangana-news/cm-revanth-on-municipal-elections/
మానసిక క్రూరత్వం
భర్త వాదనలను అంగీకరించిన దిగువ కోర్టు.. భార్య ప్రవర్తన క్రూరంగా ఉందని తీర్పునిచ్చి విడాకులు మంజూరు చేసింది. దీంతో భార్య ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన గుజరాత్ హైకోర్టు.. భార్య అతి మూఢనమ్మకాలు.. మతోన్మాద వైఖరిని తీవ్రంగా విమర్శించింది. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛలో నిరంతరం జోక్యం చేసుకోవడం, మానసిక క్షోభ కలిగించడం ‘మానసిక క్రూరత్వం’గా అభివర్ణించింది. మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవని, వాటిని జీవిత భాగస్వామిపై రుద్దడం వల్ల వివాహ బంధం విచ్ఛిన్నమవుతుందని స్పష్టం చేసింది. దిగువ కోర్టు నిర్ణయాన్ని సమర్థించిన ఉన్నత న్యాయస్థానం.. భర్తకు విడాకులు మంజూరు చేసింది. ఇలాంటి ధోరణితో ఇకపై దంపతులు కలిసి జీవించడం సాధ్యం కాదని హైకోర్టు పేర్కొంది.

