భారతదేశం మొత్తం మీద మే నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణశాఖ (IMD) హెచ్చరించింది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడటం వల్ల ఈ వేడి తీవ్రత కొంతవరకు తగ్గే అవకాశముందని కూడా స్పష్టం చేసింది.
ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సాధారణంగా ఒకటి నుండి మూడు రోజుల వరకు నమోదయ్యే వేడిగాలులు ఈసారి నాలుగు రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. అలాగే గుజరాత్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక వంటి ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇక ఈసారి ఉత్తర భారతదేశంలో వర్షపాతం గత సగటుతో పోలిస్తే 109 శాతం అధికంగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. దీర్ఘకాలిక సగటు వర్షపాతం 64.1 మిల్లీమీటర్లుగా ఉంటే, ఈసారి దాన్ని మించే వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. గాలులు, ఉరుములు, మెరుపులు వర్షాలు దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతల పెరుగుదలని కొంతవరకు అడ్డుకుంటాయని ఆయన తెలిపారు. అంతే కాకుండా కాకుండా, కొన్ని ప్రత్యేక ప్రాంతాలను మినహాయిస్తే దేశవ్యాప్తంగా మే నెలలో సాధారణం నుంచి ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు వాతావరణ హెచ్చరికలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది వాతావరణ శాఖ.