మంచుకొండల్లో హస్తానికి కొత్త ఊపిరి వచ్చింది. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకువెలుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సంఖ్యా బలాన్ని సాధించడంతో పాటు మరికొన్ని చోట్ల ఆధిక్యంలో ఉంది.
హిమాచల్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 35 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. అయితే.. కాంగ్రెస్ ఇప్పటికే 36 స్థానాల్లో గెలుపొందింది. మరో నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 23 స్థానాల్లో విజయం సాధించి మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు మూడు స్థానాల్లో గెలిచారు.
ఇక ఈ ఎన్నికల్లోనూ హిమాచల్‌ప్రదేశ్ ఓటర్లు ఆనవాయితీగా కొనసాగించారు. సీఎం జైరాం ఠాకూర్ ఓటమి పాలయ్యారు. సెరాజ్ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన ప్రజల తీర్పును శిరసావహిస్తానని చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారం చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత ఎస్ఎస్ సుఖు ఆనందాన్ని తెలియజేశాడు. బీజేపీ విభజన రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారన్నారు. కాంగ్రెస్‌కు ఘన విజయాన్ని అందించారని తెలిపారు.