Sunday, October 6, 2024
Homeనేషనల్Himalayas turning black: నల్లబడుతున్న హిమాలయాలు

Himalayas turning black: నల్లబడుతున్న హిమాలయాలు

మంచు ముట్టుకుంటే న‌ల్ల‌గా మారిపోతున్న చేతు

(తెలుగుప్ర‌భ ప్ర‌త్యేక ప్ర‌తినిధి)
హిమాల‌యాలు అంటే తెల్ల‌గా, స్వ‌చ్ఛంగా ఉండే మంచు మ‌న‌కు క‌న‌ప‌డుతుంది. మ‌న చిన్న‌త‌నం నుంచి చాలా సినిమాల్లో హిమాల‌యాల ద‌గ్గ‌ర హీరో హీరోయిన్ల పాట‌లు చూస్తుంటాం. ఆ ప్రాంతంలో ప‌ర్వ‌తారోహ‌ణ‌, ప‌ర్యాట‌కం కూడా చాలా బాగుంటాయి. కోట్లాది మంది ప్ర‌జ‌ల‌కు ప్రాణాధార‌మైన మంచినీళ్ల‌ను ఈ ప‌ర్వ‌తాలే ఇస్తుంటాయి. మ‌రి ఇంత అంద‌మైన ప‌ర్వ‌తాల‌కు దిష్టి త‌గులుతుంద‌ని అనుకున్నారో ఏమో.. దిష్టిచుక్క పెట్టేశారు మ‌న మ‌నుషులు. అవును.. హిమ‌గిరులు న‌ల్ల‌బ‌డుతున్నాయి. వాటి మీద న‌ల్ల‌టి బూడిద లాంటి ఒక ప‌దార్థం పేరుకుపోతోంది. అది ఎంత‌లాగంటే.. వాటిని ముట్టుకుంటే చేతులు న‌ల్ల‌గా అయిపోతున్నాయి. ట‌న్నుల‌కొద్దీ బ్లాక్ కార్బ‌న్ అనే ప‌దార్థం హిమాల‌యాల మీద పేరుకుపోవ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని శాస్త్రవేత్త‌లు తేల్చిచెప్పారు.

- Advertisement -

అందానికి మారుపేరైన హిమాల‌య ప‌ర్వ‌తాలు ఇప్పుడు అంద‌విహీనంగా త‌యార‌వుతున్నాయి. మ‌నిషి చేస్తున్న పాపం.. హిమగిరుల పాలిట శాపంగా మారుతోంది. కొన్ని ల‌క్ష‌ల ట‌న్నుల మేర పేరుకుపోతున్న బ్లాక్ కార్బ‌న్ అనే ఒక క‌లుషిత ప‌దార్థం హిమాల‌యాల‌ను న‌ల్ల‌గా, మ‌సిబొగ్గులా మార్చేస్తోంది. ఈ బ్లాక్ కార్బ‌న్ వ‌ల్ల మంచు ప‌ర్వ‌తాల‌న్నీ పూర్తిగా న‌ల్ల‌బ‌డిపోవ‌డ‌మే కాదు.. గ‌తంలో కంటే ఇంకా చాలా వేగంగా క‌రిగిపోతున్నాయి. త‌మ‌కు ప్రాణాధారం లాంటి హిమాల‌యాలు, భార‌తదేశానికి పెట్ట‌ని కోట‌లా ర‌క్ష‌ణ క‌ల్పించే హిమగిరులు ఇలా క‌నుమ‌రుగు అయిపోతాయంటే అక్క‌డివారు త‌ట్టుకోలేక‌పోతున్నారు. త‌మ జీవితం మొత్తం ఈ మంచు ప‌ర్వ‌తాల‌తోటే ఉంటుంద‌ని, అలాంటి కొండ‌లు ఇప్పుడు ఇలా అయిపోతున్నాయంటే తామెలా త‌ట్టుకోగ‌ల‌మ‌ని వారు గుండె ప‌గిలి రోదిస్తున్నారు. ఈ ఘోరాన్ని త‌మ క‌ళ్లారా చూడ‌లేమంటూ విల‌పిస్తున్నారు.

అస‌లేమిటీ బ్లాక్ కార్బ‌న్‌?

బ్లాక్ కార్బ‌న్ అనేది పీఎం 2.5 త‌ర‌హా కాలుష్యంతో కూడిన ప‌దార్థం. దీని స‌గ‌టు జీవిత‌కాలం కూడా చాలా త‌క్కువ‌గానే ఉంటుంది. వాతావ‌ర‌ణంలోకి విడుద‌లైన త‌ర్వాత కొన్ని రోజుల నుంచి కొన్ని వారాలు మాత్ర‌మే అది మ‌నుగ‌డ సాగిస్తుంది. ఈ అతి త‌క్కువ స‌మ‌యంలోనే వాతావర‌ణంపైన‌, మంచుగ‌డ్డ‌ల పైన‌, మ‌నుషుల ఆరోగ్యంపైన‌, అలాగే వ్య‌వ‌సాయంపైన కూడా అత్యంత తీవ్ర‌మైన ప్ర‌భావం క‌న‌బ‌రుస్తుంది. దీన్ని ఎంత త్వ‌ర‌గా నియంత్రించ‌గ‌లిగితే అంత త్వ‌ర‌గా గ్లోబ‌ల్ వార్మింగ్‌ త‌గ్గుతుంద‌ని, పంట‌ల దిగుబ‌డి పెరుగుతుంద‌ని, అకాల మ‌ర‌ణాలు కూడా అంత త్వ‌ర‌గా తగ్గుతాయ‌ని అంత‌ర్జాతీయంగా జ‌రిగిన ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే నియంత్ర‌ణ‌లు క‌ఠినంగా ఉండ‌టం వ‌ల్ల అక్క‌డ బ్లాక్ కార్బ‌న్ విడుద‌ల కొన్ని ద‌శాబ్దాల నుంచి క్ర‌మంగా తగ్గుతూ వ‌స్తోంది. కానీ, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి మాత్రం చాలా పెద్ద‌మొత్తంలో ఈ బ్లాక్ కార్బ‌న్ విడుదల అవుతోంది. యావ‌త్ ప్ర‌పంచం నుంచి విడుద‌ల అవుతున్న బ్లాక్ కార్బ‌న్‌లో 88 శాతం కేవ‌లం ఈ మూడు ప్రాంతాల నుంచి మాత్ర‌మే వ‌స్తోంది.

విడుద‌ల అయ్యేదిలా…
బ‌యోమాస్‌ను బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో కాల్చ‌డం, ఇళ్ల నుంచి వ‌చ్చే చెత్త‌ను త‌గ‌ల‌బెట్ట‌డం, బాగా పాత‌బ‌డిపోయిన డీజిల్ వాహ‌నాల వాడ‌కం లాంటి వాటి వ‌ల్ల ఇది ఉత్ప‌త్తి అవుతోంద‌న్న‌ది శాస్త్రవేత్త‌లు చెబుతున్న మాట‌. ఇది ఇత‌ర క‌ణాలు, వాయువుల‌తో క‌లిసి వెలువ‌డుతుంది. గ్లోబ‌ల్ వార్మింగ్‌కు కార‌ణాల‌లో రెండో స్థానం ఈ బ్లాక్ కార్బ‌న్‌దే కావ‌డం గ‌మ‌నార్హం. అలాగే గ్రీన్‌హౌస్ ప్ర‌భావానికి కూడా మూడింట రెండొంతులు ఇదే కార‌ణం అవుతోంద‌ని ప‌రిశోధ‌కులు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు.

ప్ర‌భావం ఇలా..
స‌హ‌జంగానే న‌ల్ల రంగు కాంతిని ఎక్కువ‌గా పీల్చుకుంటుంది. మంచుగ‌డ్డ‌ల మీద పేరుకుపోతున్న ఈ బ్లాక్ కార్బ‌న్ కూడా కాంత‌ని చాలా వేగంగా గ్ర‌హించుకుని, దాని ప‌రిస‌రాల‌న్నింటినీ బాగా వేడెక్కిస్తుంది. ఒక్కో యూనిట్‌కు కార్బ‌న్ డ‌యాక్సైడ్ కంటే బ్లాక్ కార్బ‌న్ ఏకంగా 460 రెట్ల నుంచి 1500 రెట్లు ఎక్కువ‌గా వాతావ‌ర‌ణాన్ని వేడి ఎక్కిస్తుంది. వాతావ‌ర‌ణంలో ఉన్న‌ప్పుడైతే ఇది సూర్య‌కాంతిని గ్ర‌హించి, దాన్ని ఉష్ణోగ్ర‌త‌గా మారుస్తుంది. అందుకే హిమాల‌యాల‌తో పాటు ఆర్కిటిక్ మంచుప‌ర్వ‌తాలు కూడా ఇంత‌కుముందు కంటే చాలా వేగంగా క‌రిగిపోతున్నాయి.

ప్ర‌జ‌ల‌కు నీటి క‌రువు
సింధూన‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో దాదాపు 23.5 కోట్ల మంది ఉంటారు. ఈ సంఖ్య 2050 నాటికి మ‌రో 50 శాతం పెరుగుతుంద‌ని అంచ‌నా. ఈ ప్రాంత స్థూల జాతీయోత్ప‌త్తి (జీడీపీ) అప్ప‌టికి 8 రెట్లు పెరుగుతుంద‌ని ప్ర‌పంచ బ్యాంకు ఒక అంచ‌నా వేసింది. జ‌నాభా, ఆర్థిక కార్య‌క‌లాపాలు, పారిశ్రామిక కార్య‌క‌లాపాల‌కు అనుగుణంగా ఇక్క‌డ మంచినీటి వ‌న‌రుల‌కు డిమాండ్ కూడా బాగా ఎక్కువ అవుతుంది. కానీ, బ్లాక్ కార్బ‌న్ కార‌ణంగా మంచు ప‌ర్వతాలు వేగంగా క‌రిగిపోవ‌డం వ‌ల్ల సింధూన‌ది ప‌రివాహ‌క ప్రాంతాల‌కు త‌గినంత‌గా తాగునీరు అంద‌దు. అప్పుడు ఈ ప్రాంతంలో ఉండే జ‌నాభాకు తాగునీటి కొర‌త చాలా తీవ్రంగా ఎదుర‌వుతుంది. రాబోయే పాతికేళ్ల‌లోనే ఈ సంక్షోభాన్ని మ‌నం చూడాల్సి వ‌స్తుంది. ఒక‌వేళ బ్లాక్ కార్బ‌న్ నిక్షేపాలు మ‌రింత ఎక్కువ‌గా పేరుకుంటే, మంచు ప‌ర్వ‌తాలు ఇంకా వేగంగా క‌రిగిపోయి, ఇంకా ముందుగానే ఈ సంక్షోభం మ‌న క‌ళ్ల‌ముందు క‌నిపిస్తుంది.

ప‌ర్యాట‌కానికి పెద్ద ఎదురుదెబ్బ‌
హిమాల‌యాల అందాలు చూసేందుకు ప‌ర్యాట‌కులు దేశ విదేశాల నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం చాలా పెద్ద‌సంఖ్య‌లో వ‌స్తుంటారు. చ‌ల్ల‌టి మంచుకొండ‌ల్లో సేద తీరాల‌నుకునేవారు కొంద‌రైతే, ఆ హిమగిరుల్లో త‌ప‌స్సు చేసుకునేవారు మ‌రికొంద‌రు ఉంటారు. అక్క‌డ ఉండే త‌పోసంప‌న్నుల‌ను ద‌ర్శించుకోవాల‌ని ఇంకొంద‌రు వ‌స్తారు. కానీ ఇప్పుడు న‌ల్ల‌బ‌డిన ప‌ర్వ‌తాల వైపు చూసేందుకు కూడా ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. దానికితోడు మంచు క‌రిగిపోతే చూడ‌టానికి కూడా అక్క‌డ ఏమీ మిగ‌ల‌దు. ఫ‌లితంగా ప‌ర్యాట‌కుల రాక గ‌ణ‌నీయంగా ప‌డిపోతుంది. దాంతోపాటే ప‌ర్యాట‌క ఆదాయం కూడా క్షీణిస్తుంది. పైపెచ్చు, హిమాల‌య ప్రాంతాల్లో సాధార‌ణంగా పంట‌లేమీ పండ‌వు. అందువ‌ల్ల ప‌ర్యాట‌కుల‌ను కొండ‌పైకి తీసుకెళ్ల‌డం లాంటి కార్య‌క్ర‌మాలే అక్క‌డివారికి జీవ‌నోపాధి క‌ల్పిస్తాయి. ప‌ర్యాట‌కులు రాక‌పోతే అక్క‌డివారి జీవ‌నోపాధి కూడా బాగా దెబ్బ‌తింటుంది. ఆ ప్రాంతంలో ఉండే షేర్పాల‌లో చాలామందికి ఏం జ‌రుగుతోందో, ఎందుకు జ‌రుగుతోందో తెలియ‌దు గానీ, దీనివ‌ల్ల త‌మ జీవితాల‌పై ప‌డే ప్ర‌భావం ఎలా ఉంటుందో మాత్రం స్ప‌ష్టంగా తెలుసు. అందుకే అక్క‌డ ఎవ‌రిని క‌దిలించినా ఆందోళ‌న క‌నిపిస్తోంది.

ముందే చెప్పినా..

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని ప‌ర్బ‌తి ప్రాంతంలో క్యూబిక్ మీట‌రు ప్రాంతానికి 0.34 మైక్రోగ్రాముల నుంచి 0.56 మైక్రోగ్రాముల బ్లాక్ కార్బ‌న్ పేరుకుపోతోంద‌ని దాదాపు మూడు నాలుగేళ్ల‌ క్రిత‌మే జీబీ పంత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాల‌య‌న్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సంస్థ హెచ్చ‌రించింది. ప‌ర్బ‌తి, హ‌మ్టా, బియాస్ కుండ్ లాంటి ప్రాంతాల్లో బ్లాక్ కార్బ‌న్ గాఢ‌త క్యూబిక్ మీట‌రుకు వ‌రుస‌గా 796, 416, 431 మైక్రోగ్రాముల చొప్పున ఉంది. భార‌త్, చైనాల నుంచే బ్లాక్ కార్బ‌న్ ఎక్కువ‌గా వ‌స్తోంద‌ని ప‌రిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్నారు. కొండ దిగువ‌న చెత్త త‌గ‌ల‌బెట్టిన‌ప్పుడు వెలువ‌డే బ్లాక్ కార్బ‌న్ బ‌రువు బాగా త‌క్కువ ఉండ‌టంతో గాలికి సుల‌భంగా పైకి వెళ్లి, మంచుకొండ‌ల మీద పేరుకుపోతోంది. ఈ ప్ర‌భావం మ‌రీ ఎక్కువ‌గా ఉండ‌కుండా చూడాల‌న్నా, మంచు కొండ‌ల‌ను కాపాడుకోవాల‌న్నా ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి. అలాగే అక్క‌డివారు వాటిని పాటించాలి. లేక‌పోతే హిమాల‌యాల‌ను కేవ‌లం సినిమాలు, పుస్త‌కాల్లో త‌ప్ప వాస్త‌వంగా చూడ‌లేం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News