ప్రపంచ దేశాలను చైనా కొత్త వైరస్ భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇక కొన్ని దేశాల్లో కేసులు వెలుగు చూడటంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. మళ్లీ కరోనా వంటి పరిస్థితులు వస్తాయేమో అని భయ పడుతున్నారు. ఇదిలా ఉంటే HMPV వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. ఇవాళ ఒక్కరోజే 4 కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒకటి, కోల్‌కతాలో ఒక కేసు నమోదు అయింది. దీంతో మరో మహమ్మారి విజృంభిస్తుందా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ HMPV వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జేపీ నడ్డా (JP Nadda) సూచించారు. ఇదేమీ కొత్త వైరస్ కాదని.. 2001లోనే దీనిని గుర్తించినట్లు ఆయన స్పష్టం చేశారు. అయినా ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని. ఈ వైరస్ ను ధీటుగా ఎదుర్కుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. HMPVపై కేంద్రం అప్రమత్తంగా ఉందని తెలిపారు.
HMPV వైరస్ లక్షణాలు : ఈ వైరస్ కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్యులు చెపుతున్నారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది. చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీనిబారినపడే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెప్పుకొచ్చారు. అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.
ఇదిలా ఉంటే 2019లో వచ్చిన కరోనాతో దేశంలో చాలా మంది చనిపోయారు. ఇంకెంతో మంది దీన స్థితికి చేరుకున్నారు. దీంతో కొత్త వైరస్ వచ్చిందంటే చాలు జనం హడలెత్తిపోతున్నారు. దీంతో చాలా మంది ఈ వైరస్ గురించే చర్చించుకుంటున్నారు. దీనికి తోడు దేశంలో కేసులు నమోదు కావడంతో.. మళ్లీ లాక్ డౌన్ పెడతారా అన్న సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. కేసులు పెరిగితే మన దేశంలో లాక్‌డౌన్ రావడం పక్కా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు అందరూ బాధ్యతగా వ్యవహరించి, మాస్కులు ధరించాలని మరికొందరు చెపుతున్నారు. మొత్తానికి ఈ వైరస్ భవిష్యత్తులో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.