ISI Agent Arrest: రాజస్థాన్ ఇన్టెలిజెన్స్ విభాగం అల్వార్ జిల్లాకు చెందిన మంగత్ సింగ్‌ను పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇన్టెలిజెన్స్ కోసం గూఢచర్యం చేసిన కేసులో అరెస్ట్ చేసింది. అధికార రహస్యాల చట్టం, 1923 ప్రకారం ఈ అరెస్ట్ జరగగా.. దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ప్రత్యేక క్లాసిఫైడ్ డేటా శత్రుదేశానికి అందించటం ద్వారా డబ్బు పొందినట్లు గుర్తించబడింది. పైగా సింగ్ హనీ ట్రాప్ కి గురైనట్లు అధికారులు తెలిపారు.
మంగత్ సింగ్ గత రెండేళ్లుగా పాకిస్తానీ హ్యాండ్లర్లతో నిరంతర సంబంధం కొనసాగిస్తూ.. అల్వార్ ఆర్మీ కాంటోన్మెంట్, ఇతర వ్యూహాత్మక ప్రదేశాలకు సంబంధించిన సున్నితమైన సైనిక సమాచారాన్ని పంచుకున్నాడని అధికారులు వెల్లడించారు. జాతీయ రాజధాని ప్రాంతంలో భాగమైన అల్వార్ రక్షణపరంగా అత్యంత కీలక ప్రదేశంగా పరిగణించబడుతుంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వ్యూహాత్మక ప్రాంతాల వద్ద అనుమానాస్పద కదలికలపై తమ దృష్టిని మరింతగా పెంచారు. ఈ క్రమంలో అల్వార్ కాంటోన్మెంట్ ప్రాంతంలో మంగత్ సింగ్ కదలికలు అనుమానం కలిగించడంతో అతని ఫోన్ కాల్స్, డిజిటల్ కమ్యూనికేషన్ లను పరిశీలించటంతో అసలు విషయం బయటపడింది. నిందితుడు అరెస్ట్ అయ్యేవరకు కూడా పాకిస్తానీ హ్యాండ్లర్లకు సైనిక సమాచారం పంపుతూనే ఉన్నట్లు డీఐజీ ఇంటెలిజెన్స్ రాజేష్ మీల్ చెప్పారు.
సింగ్ రెండు పాకిస్తానీ నంబర్లతో తరచూ సంప్రదింపులు జరిపేవాడని గుర్తించారు. పెద్దమొత్తంలో డబ్బు అతనికి బదిలీ అయినట్లు గుర్తించారు. దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం.. ఒక పాకిస్తానీ మహిళా గూఢచారి ఇషా శర్మ అనే పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ సృష్టించి.. మంగత్ సింగ్‌ను హనీ-ట్రాప్ చేసిందని అధికారులు వెల్లడించారు. ఆమె భావోద్వేగంగా ప్రభావితం చేసి, ఆర్థిక ప్రలోభాలు చూపి సైనిక రహస్యాలను అందించేలా ప్రేరేపించిందని వెల్లడించారు. అతను వాడిన నంబర్లలో ఒకటి హనీ-ట్రాప్ ఆపరేషన్‌కు, మరొకటి నేరుగా ISI అధికారులకు సంబంధించినదని తెలిసింది. గోప్యమైన సమాచారం మార్చుకున్న ప్రతిసారి అతనికి పాకిస్తాన్ నుంచి డబ్బు పంపినట్లు గుర్తించగా దాని సమాచారం సేకరిస్తున్నారు అధికారులు.
అక్టోబర్ 10న అతని మొబైల్ ఫోన్, డిజిటల్ రికార్డులపై సాంకేతిక అనాలసిస్ తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. జైపూర్‌లోని ప్రత్యేక పోలీస్ స్టేషన్‌లో అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతనిని సెంట్రల్ ఇంటరాగేషన్ సెంటర్లో విచారిస్తున్నారు. మంగత్ సింగ్ కేవలం కాంటోన్మెంట్ మ్యాప్‌లు మాత్రమే కాకుండా.. సైనిక వ్యూహాత్మక ప్రణాళికలు, మౌలిక సదుపాయాల సమాచారం కూడా పంచే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.


