Ex-Banker Loses ₹23 Crore in ‘Digital Arrest’ Scam: సైబర్ మోసగాళ్ల చేతిలో ‘డిజిటల్ అరెస్ట్’కు గురై తన జీవితకాల సంపాదన రూ. 23 కోట్లు పోగొట్టుకున్న 78 ఏళ్ల మాజీ బ్యాంకర్ కథ ఎంతో మందికి ఒక హెచ్చరికగా నిలుస్తోంది. తన కన్నీళ్లను ఆపుకుంటూ, “వృద్ధాప్యంలో రక్షణ కోసం నా జీవితమంతా పొదుపు చేసుకున్నాను. కేవలం ఒక నెలలోనే అదంతా పోయింది. సరైన వారిని నమ్మకపోవడం వల్లే ఇది జరిగింది. నా కథ ఇతరులకు హెచ్చరికగా ఉంటుందని ఆశిస్తున్నాను” అని ఆయన అన్నారు.
సౌత్ ఢిల్లీలోని గుల్మొహర్ పార్క్‌కు చెందిన నరేష్ మల్హోత్రా అనే ఈ మాజీ బ్యాంకర్, ఆగస్టు 1న ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ అందుకున్నాడు. అతని ఆధార్ కార్డును ముంబైలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే కేసులకు లింక్ అయిన ఒక మొబైల్ కనెక్షన్ కోసం ఉపయోగించారని ఆ కాల్‌లో చెప్పాడు. ఆ తర్వాత ముంబై పోలీసులు, ఈడీ, సీబీఐ అధికారులమని చెప్పుకునే వివిధ వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ రావడం మొదలైంది.
‘డిజిటల్ అరెస్ట్’ అంటే..
వారు నరేష్ మల్హోత్రాను ‘డిజిటల్ అరెస్ట్’లో ఉన్నారని, అంటే పోలీసుల నిఘాలో ఉన్నారని, ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని చెప్పారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి వీడియో కాల్‌లో ఉండాలని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని ఆదేశించారు. అంతేకాకుండా, ఆయన పాస్‌పోర్ట్‌ను కూడా స్వాధీనం చేసుకుంటామని, విదేశాలకు వెళ్లకూడదని బెదిరించారు.
ALSO READ: Nepo Kids: మనీశ్ ‘నెపో కిడ్స్’ ట్వీట్‌పై బీజేపీ విమర్శ.. ‘కొంచెం ఎదగండి’ అని కాంగ్రెస్ కౌంటర్
రూ. 23 కోట్లు ఎలా పోయాయి?
మోసగాళ్లు మొదట ఆయన పొదుపు వివరాలు అడిగి, ధ్రువీకరణ కోసం రూ. 14 లక్షలు బదిలీ చేయాలని కోరారు. ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తామని నమ్మబలికారు. ప్రతీ బదిలీ తర్వాత నకిలీ ఆర్‌బీఐ సర్టిఫికెట్లను పంపించారు. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, ఇతర పెట్టుబడుల వివరాలు అడిగారు. బొంబాయి హైకోర్టు ఆదేశాల మేరకు వాటిని ధ్రువీకరిస్తున్నామని నమ్మించారు. తన కుటుంబ సభ్యులను కూడా కేసుల్లో ఇరికిస్తామని బెదిరించడంతో, భయపడిన నరేష్ మల్హోత్రా తన పెట్టుబడులను విక్రయించి, ఆ డబ్బును మోసగాళ్లు ఇచ్చిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ఇలా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 4 మధ్య, 20 లావాదేవీల ద్వారా ఆయన మూడు బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం రూ. 23 కోట్లు బదిలీ అయ్యాయి.
సెప్టెంబర్ 14న, మోసగాళ్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ పేరుతో మరో రూ. 5 కోట్లు డిమాండ్ చేయగా, ఆయనకు అనుమానం వచ్చి నిరాకరించారు. నేరుగా కోర్టులోనే డిపాజిట్ చేస్తానని, లేదా పోలీసులకు లొంగిపోతానని చెప్పడంతో మోసగాళ్ల నుంచి కాల్స్ రావడం ఆగిపోయాయి. దాంతో తాను మోసపోయానని గ్రహించి, సెప్టెంబర్ 19న పోలీసులను ఆశ్రయించారు.
ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల ఐఎఫ్ఎస్‌ఓ (Intelligence Fusion and Strategic Operations) విభాగం కేసు దర్యాప్తు చేస్తోంది. ఇప్పటివరకు రూ. 2.67 కోట్లు ఫ్రీజ్ చేయగలిగామని, ఈ డబ్బు 4,000కు పైగా ఖాతాల ద్వారా బదిలీ అయినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.
ALSO READ: All-women Police: ఎన్‌కౌంటర్ చేసిన తొలి మహిళా పోలీసు బృందం.. కాల్పులు జరిపిన నేరస్థుడు అరెస్ట్


