Delhi child rape case: దేశ రాజధాని దిల్లీలో మానవత్వం మరోసారి మంటగలిసింది. రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రోజంతా కష్టపడి పూలు అమ్ముకునే ఓ 11 ఏళ్ల బాలికపై ఒక కామాంధుడు కన్నేశాడు. కేవలం కామవాంఛతోనే కాకుండా.. అత్యంత కిరాతకంగా ఆమెను మృత్యువు అంచులకు నెట్టివేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
జనవరి 11న ప్రసాద్ నగర్ ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఆ చిన్నారి ఎప్పటిలాగే ఎండలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గులాబీలు అమ్ముతోంది. అదే సమయంలో అటుగా వచ్చిన దుర్గేష్ (40) అనే ఈ-రిక్షా డ్రైవర్.. ఆ పసిపాపపై కన్నేశాడు. నీ దగ్గరున్న పూలన్నీ నేనే అమ్ముతాను రా.. అంటూ నమ్మబలికి ఆమెను తన రిక్షాలోకి ఎక్కించుకున్నాడు. ఆ అమాయక బాలిక తన కష్టం తీరుతుందన్న ఆశతో వాహనం ఎక్కింది. కానీ అది తన జీవితాన్ని చీకటిలోకి నెట్టే ప్రయాణం అని ఆమె ఊహించలేకపోయింది. రామ్ నాథ్ విజ్ మార్గ్ సమీపంలోని నిర్మానుష్య అటవీ ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లిన దుర్గేష్.. అక్కడ తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. బాలికపై అమానుషంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమె తీవ్రంగా రక్తస్రావమై స్పృహ కోల్పోవడంతో.. చనిపోయిందని భావించి అక్కడే వదిలేసి పరారయ్యాడు.
also read IndiGo : కుప్పకూలిన ఇండిగో లాభాలు..ఆకాశం నుంచి నేలకు…!
కొద్దిసేపటి తర్వాత తిరిగి స్పృహలోకి వచ్చిన సదరు బాలిక, నరకయాతన అనుభవిస్తూనే అతి కష్టం మీద తన కుటుంబాన్ని చేరుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. దాదాపు 15 రహదారుల్లో ఉన్న 300 సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టగా.. ఒక ఫుటేజీలో ఆ చిన్నారి ఈ-రిక్షా ఎక్కుతున్న దృశ్యం కనిపించింది. ఆ వాహనం నంబర్ ఆధారంగా నిందితుడు దుర్గేష్‌ను చివరికి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
విచారణలో ఆ నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం నివ్వెరపోయారు. గత కొంతకాలంగా ఆ బాలికను గమనిస్తున్నానని.. పక్కా ప్లాన్ ప్రకారమే కిడ్నాప్ చేశానని వాడు అంగీకరించాడు. ఈ మృగానికి కఠిన శిక్ష పడాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు. చట్టాలు ఎన్ని కఠినంగా ఉన్నా.. ఇలాంటి పైశాచిక బుద్ధి కలిగిన వ్యక్తుల వల్ల సమాజంలో ఆడపిల్లలకు భద్రత కరువవుతోందనేది అక్షర సత్యం.

