Thursday, December 11, 2025
Homeనేషనల్Special Intensive Revision (SIR): 45 ఏళ్ల తర్వాత ఇంటికొచ్చిన కొడుకు.. 'SIR' సర్వేతో బయటపడ్డ...

Special Intensive Revision (SIR): 45 ఏళ్ల తర్వాత ఇంటికొచ్చిన కొడుకు.. ‘SIR’ సర్వేతో బయటపడ్డ అద్భుతం!

SIR Verification Visit Brought Missing Rajasthan Man Home: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా Special Intensive Revision (SIR) గురించే చర్చ నడుస్తోంది. ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన ఈ ప్రక్రియపై రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. అనేక చోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో మాత్రం ఈ SIR క్యాంపెయిన్ ఒక అద్భుతాన్ని సుసాధ్యం చేసింది. రాజకీయ విమర్శల మాట అటుంచితే, ఈ సర్వే కారణంగా 45 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఒక వ్యక్తి తిరిగి తన తల్లి చెంతకు చేరుకున్నాడు. వినడానికి సినిమా కథలా ఉన్నా, ఇది నిజంగా జరిగిన సంఘటన.

- Advertisement -

ALSO READ: New Labour Codes 2025 : ‘కొత్త లేబర్ కోడ్ 2025’తో వేతన వ్యవస్థలో పెను మార్పులు..!

1980లో అదృశ్యం.. 1300 కిలోమీటర్ల దూరం

కథలోకి వెళ్తే.. భిల్వారా జిల్లా, ఆసింద్ తాలూకాలోని సూరజ్ గ్రామానికి చెందిన ఉదయ్ సింగ్ 1980లో ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అప్పుడు చిన్న వయసులో ఉన్న ఉదయ్ కోసం కుటుంబ సభ్యులు దేశం నలుమూలలా వెతికారు. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. కాలం గడుస్తున్నా, కొడుకు ఎప్పటికైనా తిరిగి వస్తాడనే ఆశతో తల్లి చునీ దేవి రాావత్ ఎదురుచూస్తూనే ఉంది. ఇన్నాళ్లు ఉదయ్ సింగ్ ఇంటికి 1,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో నివసిస్తున్నాడు. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో గార్డుగా పనిచేశాడు. దురదృష్టవశాత్తు మధ్యలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో గతం మర్చిపోయాడు. ఇల్లు, కుటుంబం వివరాలేవీ గుర్తులేకుండా పోయాయి.

జ్ఞాపకాలను తట్టిలేపిన ఓటరు జాబితా

సరిగ్గా ఇప్పుడే SIR వెరిఫికేషన్ ప్రక్రియ తెరపైకి వచ్చింది. ఓటర్ల జాబితా సవరణ, పత్రాల పరిశీలన అనే మాటలు ఉదయ్ సింగ్ చెవిన పడ్డాయి. పత్రాల గురించి ఆరా తీస్తుండగా, మసకబారిన అతడి జ్ఞాపకాల్లో ‘సూరజ్’ అనే తన గ్రామం పేరు, తన కులం వివరాలు మెదిలాయి. వెంటనే బుధవారం నాడు సూరజ్ గ్రామానికి చేరుకుని అక్కడి స్థానిక పాఠశాలలో ఓటరు ఫామ్స్ గురించి వాకబు చేశాడు. చాలా ఏళ్ల తర్వాత వచ్చిన కొత్త వ్యక్తిని చూసి అక్కడి ఉపాధ్యాయుడికి అనుమానం వచ్చింది. వెంటనే ఉదయ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.

అమ్మ గుర్తుపట్టిన గాయం మచ్చలు

దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత చూడటంతో కుటుంబ సభ్యులు ఉదయ్ సింగ్‌ను పోల్చుకోలేకపోయారు. కానీ ఉదయ్ చెప్పిన చిన్ననాటి సంఘటనలు, కుటుంబ విషయాలు విన్న తర్వాత వారిలో నమ్మకం మొదలైంది. చివరగా, తల్లి చునీ దేవి తన కొడుకు నుదురు, ఛాతీపై ఉన్న పాత గాయం మచ్చలను పరిశీలించి గుర్తుపట్టింది. అంతే.. ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. తప్పిపోయిన తన బిడ్డ ఇన్నాళ్లకు దొరికాడంటూ ఆమె గుండెలు పగిలేలా రోదించిన దృశ్యం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.

ఊరంతా పండగ వాతావరణం

ఉదయ్ సింగ్ రాకతో ఆ చిన్న గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. కేవలం 150 ఇళ్లు ఉన్న ఆ ఊరి జనం, దూరపు బంధువులు ఉదయ్‌ని చూసేందుకు తరలివచ్చారు. పెళ్లి కొడుకులా అతన్ని గుర్రంపై కూర్చోబెట్టి, డప్పు చప్పుళ్లు, డీజే పాటలతో గ్రామంలో ఊరేగింపు (బిండోరి) నిర్వహించారు. రాజకీయంగా SIR మీద ఎన్ని విమర్శలు ఉన్నా, తమ బిడ్డను తిరిగి తెచ్చిపెట్టినందుకు ఆ తల్లి మాత్రం మురిసిపోతోంది.

ALSO READ: Assam Bans Polygamy: ఇక రెండో పెళ్లి చేసుకుంటే పదేళ్ళు జైలు శిక్ష

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News