Mamata Banerjee on Durgapur Gang Rape: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఒడిశాకు చెందిన 23 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థినిపై జరిగిన అత్యంత దారుణమైన సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుండగా, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాన్ని రాజేశాయి. బాధితురాలికి అండగా నిలవాల్సింది పోయి, “అసలు ఆమె అర్ధరాత్రి 12:30 గంటలకు బయట ఎందుకు ఉంది?” అని ప్రశ్నించి బాధితురాలినే తప్పుబట్టేలా మాట్లాడటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరిగింది?
ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన ఓ యువతి దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లగా, కొందరు దుండగులు వారిని అడ్డగించారు. యువతిని బలవంతంగా సమీపంలోని నిర్మానుష్య అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటన తర్వాత తీవ్ర దిగ్భ్రాంతికి గురైన యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను – అపు బౌరి (21), ఫిర్దోస్ సేఖ్ (23), సేఖ్ రియాజుద్దీన్ (31) – అరెస్టు చేయగా, మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలితో పాటు ఉన్న స్నేహితుడి పాత్రపై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: IPS Officer’s Suicide : ఐపీఎస్ ఆత్మహత్య.. కుటుంబం అంగీకారం లేకుండానే బలవంతంగా పోస్టుమార్టం?
మమతా వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ దారుణ ఘటనపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ, బాధ్యతను ప్రైవేట్ కాలేజీ యాజమాన్యంపైకి నెట్టే ప్రయత్నం చేశారు. “ఆమె ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతోంది. విద్యార్థుల భద్రత ఎవరి బాధ్యత? ఆమె అర్ధరాత్రి 12:30 గంటలకు బయటకు ఎలా వచ్చింది? రాత్రిపూట సంస్కృతిని, విద్యార్థులను ప్రైవేట్ కాలేజీలే చూసుకోవాలి. అది అటవీ ప్రాంతం, వారిని బయటకు అనుమతించకూడదు,” అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ కూడా అత్యాచారాలు జరుగుతున్నాయంటూ రాజకీయ విమర్శలు చేశారు.
భగ్గుమన్న ప్రతిపక్షాలు, బాధితురాలి తండ్రి ఆవేదన
మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది బాధితురాలిని అవమానించడమేనని, నిందితులకు కొమ్ముకాసేలా ఉందని ఆరోపించింది. శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైన మమత, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి బాధితురాలినే నిందిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శించారు.
ALSO READ: Karnataka Politics: సీఎం కుర్చీపై డీకే ‘శివ’తాండవం! – “నా తలరాత నాకు తెలుసు”
మరోవైపు, బాధితురాలి తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. “నా కుమార్తె తీవ్ర నొప్పితో బాధపడుతోంది, కనీసం నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైంది. బెంగాల్‌లో ఆమెకు రక్షణ లేదనిపిస్తోంది. ఇక్కడ నమ్మకం పోయింది. అందుకే నా కూతురిని తిరిగి ఒడిశాకు తీసుకెళ్లిపోతాను,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తనతో ఫోన్‌లో మాట్లాడి, అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
ఒడిశా సీఎం మాఝీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మమతా బెనర్జీని కోరారు. ఈ ఘటన రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలకు కూడా దారితీసింది. ఒకవైపు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా, మరోవైపు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సృష్టించిన రాజకీయ దుమారం మాత్రం చల్లారడం లేదు.
ALSO READ: Wife Murder: ప్రియురాలితో పెళ్లికి ఒప్పుకోలేదని భార్యకి నిప్పంటించిన భర్త


