RSS Chief Says Every Family Should Have Three Children: ప్రతి భారతీయ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో జనాభా నియంత్రణ, జనాభా మార్పుపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ముగ్గురి కంటే తక్కువ సంతానోత్పత్తి రేటు ఉన్న సమాజాలు క్రమంగా అంతరించిపోతాయని నిపుణులు చెబుతున్నారని భగవత్ అన్నారు. కాబట్టి ప్రతి దేశంలో సంతానోత్పత్తి రేటు మూడు కంటే ఎక్కువగా ఉండాలని ఆయన సూచించారు.
దేశ ప్రయోజనాల కోసం..
సరైన వయస్సులో వివాహం చేసుకొని ముగ్గురు పిల్లలను కనడం వల్ల తల్లిదండ్రులు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెప్పారని భగవత్ తెలిపారు. ముగ్గురు తోబుట్టువులు ఉన్న ఇళ్లలో పిల్లలు అహంకార నిర్వహణను కూడా నేర్చుకుంటారని, భవిష్యత్తులో వారి కుటుంబ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవని ఆయన చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం ప్రతి భారతీయ దంపతులు ముగ్గురు పిల్లలను కనడానికి ప్రయత్నించాలని ఆయన నొక్కి చెప్పారు.
జనాభా ఒక వరం అయినప్పటికీ, అదే సమయంలో అది భారం కూడా కావచ్చు అని భగవత్ పేర్కొన్నారు. అందుకే జనాభా నియంత్రణ కోసం విధానం అవసరమని ఆయన అన్నారు. జనాభాను నియంత్రించడంతో పాటు, సరిపడా జనాభా ఉండేలా చూసుకోవడానికి ప్రతి కుటుంబానికి ముగ్గురు పిల్లలు ఉండడం మంచిదని చెప్పారు.
జనాభా అసమతుల్యతకు మత మార్పిడులు ఒక ప్రధాన కారణమని భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. మత మార్పిడి అనేది భారతీయ సంప్రదాయాలలో భాగం కాదని, అది జరగకూడదని క్రైస్తవులు, ముస్లింలు కూడా చెబుతున్నారని ఆయన అన్నారు.
మరోవైపు, అక్రమ చొరబాటు కూడా జనాభా అసమతుల్యతకు కారణమని, దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు. చట్టపరమైన మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించి, ఇక్కడ ఉపాధి పొందే వారికి ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ అక్రమ చొరబాటుదారులకు పౌరులు ఉపాధి కల్పించకూడదని ఆయన పిలుపునిచ్చారు.


