Marital cruelty for body shaming : కట్టుకున్న భార్య అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి భర్త కోరుకుంటాడు. కానీ, ఆ కోరిక శృతి మించి పైశాచికంగా మారితే ఆ భార్య పరిస్థితి ఏంటి..? తన భార్య అచ్చం సినీతార నోరా ఫతేహిలా నాజూకుగా మారిపోవాలంటూ ఓ ప్రబుద్ధుడు కన్నెర్రజేశాడు. ఆమె ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేయించాడు. అలుపొచ్చి వద్దంటే అన్నం పెట్టకుండా ఆకలితో మాడ్చాడు. అంతటితో ఆగక, కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా కబళించాడు. ఈ దారుణానికి అత్తింటివారు వంత పాడటంతో ఆ నవవధువు జీవితం నరకప్రాయమైంది. ఇంతకీ ఆ భర్త ఎందుకిలా ప్రవర్తించాడు..? ఆ తర్వాత ఏం జరిగింది..?
అందమనే పేరుతో అంతులేని హింస : వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది మార్చిలో మేరఠ్‌కు చెందిన యువతికి ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేస్తున్న వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది రోజులకే భర్త అసలు స్వరూపం బయటపడింది. అతనికి సినీనటి నోరా ఫతేహి అంటే పిచ్చి అభిమానం. తన భార్య కూడా ఆమెలాగే సన్నగా, నాజూకుగా ఉండాలని ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు. రోజూ బలవంతంగా జిమ్‌కు తీసుకెళ్లి మూడు గంటల పాటు నిర్విరామంగా వ్యాయామం చేయించేవాడు. ఏ రోజైనా జిమ్‌కు వెళ్లనంటే, ఆ రోజు ఆమెకు భోజనం పెట్టకుండా ఆకలితో శిక్షించేవాడు. ఈ క్రూరమైన చర్యలతో ఆమె తీవ్రంగా బలహీనపడింది.
“‘నిన్ను పెళ్లి చేసుకుని నా జీవితం నాశనమైంది. నోరా ఫతేహి లాంటి అమ్మాయిని చేసుకుని ఉంటే బాగుండేది’ అంటూ నా భర్త నిరంతరం నా రూపాన్ని ఎగతాళి చేసేవాడు. బాడీ షేమింగ్ చేస్తూ మానసికంగా హింసించేవాడు,” అని బాధితురాలు తన ఫిర్యాదులో కన్నీటిపర్యంతమైంది.
కట్నం కక్కుర్తి.. గర్భస్రావం : పెళ్లి సమయంలో బాధితురాలి కుటుంబం మహీంద్రా స్కార్పియో కారు, నగదు, నగలతో పాటు వివాహ వేడుకలకు రూ. 75 లక్షల వరకు ఖర్చు చేసింది. అయినప్పటికీ, అదనపు కట్నం కోసం అత్తమామలు వేధించడం ప్రారంభించారు. ఇంటి పనులతో సతమతం చేస్తూ, భర్తతో ఏకాంతంగా గడపనీయకుండా చేసేవారు. ఈ క్రమంలోనే, రెండు నెలల క్రితం తాను గర్భవతి అని తెలుసుకున్న ఆ యువతి ఆనందం ఆవిరైంది. ఈ విషయం అత్తగారికి చెప్పినా ఆమె పట్టించుకోలేదు. ఒకరోజు భర్త ఏదో మాత్ర ఇచ్చి బలవంతంగా వేయించాడు. అనుమానం వచ్చి ఆన్‌లైన్‌లో వెతకగా అది గర్భస్రావం కోసం వాడే మాత్ర అని తెలిసి ఆమె కుప్పకూలిపోయింది.
ఆ మాత్ర ప్రభావంతో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో, అత్తింటివారు ఆమెను పుట్టింటికి పంపించేశారు. ఆ తర్వాత ఫోన్ చేసి విడాకులు ఇప్పిస్తామని బెదిరించడంతో ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది. తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించగా, వైద్యులు గర్భస్రావం జరిగిందని ధ్రువీకరించారు. దీనిపై భర్తను నిలదీయగా, “నిన్నే నా భార్యగా అంగీకరించనప్పుడు, నీ కడుపులో బిడ్డను ఎలా అంగీకరిస్తాను?” అని కర్కశంగా సమాధానమిచ్చాడు.
కేసు నమోదు చేసి దర్యాప్తు : జూలై చివరిలో తిరిగి భర్త ఇంటికి వెళ్లిన బాధితురాలిని అత్తమామలు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆమె పోలీసులను ఆశ్రయించింది. మహిళా పోలీస్ స్టేషన్‌లో తన భర్త, అత్తమామలు, వదినపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై వరకట్న వేధింపులు, ఉద్దేశపూర్వక అవమానం, బలవంతపు గర్భస్రావం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సలోని అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని, ఆరోపణలను పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


