Saturday, November 15, 2025
Homeనేషనల్Triple Talaq: కోర్టు బయటే ట్రిపుల్‌ తలాక్‌.. భర్తను చెప్పుతో చితకబాదిన భార్య.. వైరల్‌ వీడియో

Triple Talaq: కోర్టు బయటే ట్రిపుల్‌ తలాక్‌.. భర్తను చెప్పుతో చితకబాదిన భార్య.. వైరల్‌ వీడియో

Triple Talaq in UP Viral Video: ఉత్తరప్రదేశ్‌లో కోర్టు బయట భర్తను భార్య చెప్పుతో చితకబాదింది. భరణం కేసులో భాగంగా విచారణకు హాజరైన భార్యకు.. భర్త కోర్టు బయటే మూడుసార్లు తలాక్‌ చెప్పాడు. అంతేకాకుండా దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన మహిళ ఆత్మరక్షణ కోసం భర్తపై  చెప్పుతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

- Advertisement -

వివరాల్లోకి వెళితే 2018లో తనకు వివాహం జరిగిందని మహిళ వెల్లడించింది. తమకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని.. పెళ్లైనప్పటి నుంచే అదనపు కట్నం కోసం భర్త వేధింపులు మొదలు పెట్టాడని బాధితురాలు వాపోయింది. పిల్లలు పుట్టాక ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని.. దీంతో కోర్టును ఆశ్రయించానని మహిళ వెల్లడించింది. ఆర్థిక సాయం కోరుతూ భరణం కేసు పెట్టడంతో.. పిల్లలను తన దగ్గర నుంచి బలవంతంగా లాక్కెళ్లిపోయాడని విలపించింది. 

Also Read: https://teluguprabha.net/national-news/jharkhand-maoist-encounter-sahadev-soreng-death-2025/

ఈ క్రమంలో ఆర్థిక సాయం కోరుతూ మహిళ రాంపూర్‌ కోర్టులో దావా వేయడంతో ఈ కేసుపై శుక్రవారం విచారణ జరిగింది. ఈ విచారణకు బాధితురాలు తన అత్తతో కలిసి హాజరుకాగా, ఆమె భర్త తన తండ్రితో కలిసి కోర్టుకు చేరుకున్నారు. విచారణ అనంతరం బాధితురాలు కోర్టు నుంచి బయటకు రాగా.. వెంటనే భర్త, ఆమె మామ ఇద్దరూ కలిసి బాధితురాలిని వెంబడించి దుర్భాషలాడారు. కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తేగా.. ఆమె నిరాకరించింది. దీంతో తండ్రి ప్రోద్బలంతో భర్త అక్కడికక్కడే భార్యకు మూడుసార్లు ‘తలాక్..’ చెప్పడంతో ఆమెపై దాడికి దిగినట్టు బాధితురాలు వివరించింది. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం చెప్పుతో భర్తపై దాడి చేసినట్లు పేర్కొంది.

తనకు వేరే మార్గం కనిపించలేదని కోర్టు బయట మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ‘మొదట వాళ్లే నన్ను కొట్టారు. అందుకే ఆత్మరక్షణ కోసం వారిపై దాడి చేయాల్సి వచ్చింది. నా భర్త, మామను వెంటాడి చెప్పుతో కొట్టాను. నా పిల్లలను నాకు దూరం చేసి.. నా జీవితాన్ని నాశనం చేశారు. ఇప్పుడు తలాక్‌ చెప్పి నాపై దాడి చేశాడు. ఇదంతా నేను ఎలా సహిస్తాను..? నాకు న్యాయం కావాలి. నా ఇద్దరు కూతుళ్లను నాకు అప్పగించి.. భరణంతో పాటు మేం అదే ఇంట్లో నివసించే హక్కు కల్పించాలి.’ అని బాధితురాలు కోరింది. 

Also Read: https://teluguprabha.net/telangana-news/ktr-accuses-congress-of-corruption-in-telangana/

అదేవిధంగా నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయాలని బాధితురాలు డిమాండ్‌ చేసింది. కోర్టు ఆవరణలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో కాసేపు ఆందోళన నెలకొంది. కొందరు దంపతుల గొడవను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad