Husband seeking alimony from wife : సాధారణంగా భార్యలు భర్తల నుంచి భరణం కోరడం సర్వసాధారణం. కానీ, ఏకంగా భార్య నుంచే భర్త భరణం కోరడం ఎప్పుడైనా విన్నారా? ఇది అసాధారణమే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఒక విచిత్రమైన కేసు. కింది కోర్టులో చుక్కెదురైనా, పట్టు వదలని విక్రమార్కుడిలా హైకోర్టు మెట్లెక్కిన ఆ భర్త కథ ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అసలు ఈ దావా వెనుక ఉన్న కారణాలు ఏంటి? భారతీయ చట్టాలు ఈ విషయంలో ఏం చెబుతున్నాయి? ఈ ఆసక్తికరమైన పరిణామాలపై ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
భారతీయ చట్టాలు – మగవారి ఆవేదన : భారతీయ చట్టాలు ఆడవారికే ఎక్కువ అనుకూలంగా ఉంటాయని మగవాళ్లు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గృహహింస నిరోధక చట్టం 498ఏ వంటి వాటిపై ఎన్నో ఏళ్లుగా చర్చ నడుస్తోంది. ఇక విడాకుల విషయానికి వచ్చేసరికి, భర్తలకు భరణం అనేది పెద్ద భారంగా మారుతుందనే వాదన ఎప్పటినుంచో ఉంది. ఎంతో మంది సంపన్నులు తమ భార్యలకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి విడాకులు తీసుకున్న ఘటనలు కోకొల్లలు. అదే సమయంలో, భార్యకు భరణం ఇవ్వడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న భర్తలూ లేకపోలేదు. కొంతమంది మహిళలు ఈ చట్టాలను ఆయుధంగా చేసుకుని, పెళ్లిళ్లను ఒక వ్యాపారంగా మార్చుకుంటున్నారన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇలాంటి తరుణంలో, ఒక భర్త ఏకంగా తన భార్య నుంచి భరణం ఇప్పించాలంటూ కోర్టు మెట్లెక్కడం నిజంగా సంచలనం సృష్టించింది. ఇది లింగ సమానత్వంపై కొత్త చర్చకు తెర తీస్తోంది.
సఫాయి కర్మచారి నుంచి ఎస్డీఎం భార్యపై దావా : ఈ సంచలన కేసులో ప్రధాన పాత్రధారులు అలోక్ కుమార్, జ్యోతి మౌర్య. అలోక్ కుమార్ 2009లో పంచాయతీ రాజ్ శాఖలో సఫాయి కర్మచారిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2010లో జ్యోతి మౌర్యను వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత తన భార్య చదువుకోవాలనే ఆసక్తిని చూపడంతో, అలోక్ ఆమెను బాగా ప్రోత్సహించి చదివించారు. అలోక్ పడిన కష్టం ఫలించి, 2015లో జ్యోతి పీసీఎస్ (ప్రావిన్షియల్ సివిల్ సర్వీసెస్) పరీక్షలో అర్హత సాధించి, ఎస్డీఎం (సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్)గా బాధ్యతలు స్వీకరించింది.
అయితే, ఎస్డీఎమ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జ్యోతి వైఖరిలో మార్పు వచ్చిందని అలోక్ ఆరోపించాడు. తనతో పాటు తన కుటుంబం పట్ల ఆమె వ్యవహారశైలి పూర్తిగా మారిపోయిందని, ఆ తర్వాత తన నుంచి విడాకులు కోరిందని అలోక్ వివరించాడు. ఈ నేపథ్యంలో, జ్యోతి మౌర్య తన భర్త అలోక్ కుమార్ నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
భరణం కోసం హైకోర్టుకు : విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సమయంలోనే, అలోక్ కుమార్ హిందూ వివాహాల చట్టంలోని సెక్షన్ 24 కింద తన భార్య నుంచి భరణం కోసం దరఖాస్తు దాఖలు చేశాడు. ఈ సెక్షన్ ప్రకారం, విడాకుల కేసు విచారణలో ఉన్నప్పుడు, భార్య లేదా భర్తలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే, వారికి జీవిత భాగస్వామి నుంచి భరణం పొందే హక్కు ఉంటుంది. ప్రయాగ్‌రాజ్ కుటుంబ కోర్టు అలోక్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.
దీంతో నిరాశ చెందని అలోక్, ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఉత్తరప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు విచారణ చేపట్టి, జ్యోతి మౌర్యకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు ఇప్పుడు హైకోర్టులో విచారణలో ఉంది. కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థిస్తుందా, లేక అలోక్ కుమార్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తుందా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. ఈ కేసు భారతీయ న్యాయ వ్యవస్థలో భరణం చట్టాలపై కొత్త చర్చకు తెర తీసింది.


