Husband Suicide with Children: ఈ మధ్య కాలంలో భర్త, పిల్లలను వదిలి భార్య.. ప్రియుడితో కలిసి పారిపోవడం ఘటనలు తరచూ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలు దాంపత్య జీవిత విలువలపై ప్రభావం చూపిస్తున్నాయి. భర్తతో విభేదాలు, వివాహేతర సంబంధాల పట్ల ఆకర్షితులై కడుపున పుట్టిన పిల్లలను వదిలి తమ సుఖం చూసుకుంటున్నారు. ఆ తర్వాత భర్త, పిల్లల మానసిక పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఆలోచించడం లేదు. ఇక్కడ ఓ మహిళ కూడా అలాగే ఆలోచించకుండా వెళ్లిపోయింది. ఫలితంగా ఓ విషాదకర సంఘటనే చోటుచేసుకుంది.
Also Read: https://teluguprabha.net/national-news/nirav-modi-extradition-india-november-23-uk-court/
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి పారిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన భర్త.. తన నలుగురు పిల్లలతో కలిసి నదిలోకి దూకాడు. ఆత్మహత్యకు ముందు అతడు రికార్డు చేసిన వీడియోను సోదరికి పంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు వారి కోసం ఆ నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
సల్మాన్, ఖుష్నుమా దంపతులకు 15 ఏళ్ల కిందట వివాహం కాగా.. వారికి 12 ఏళ్ల మహక్, ఐదేళ్ల షిఫా, మూడేళ్ల అమన్, ఎనిమిది నెలల శిశువు ఇనైషా సంతానం. కాగా, ఖుష్నుమాకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3న సల్మాన్, ఖుష్నుమా మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో.. కోపంతో ఖుష్నుమా తన ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ తన నలుగురు పిల్లలను తీసుకుని యమునా నది బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు.
Also Read: https://teluguprabha.net/national-news/up-man-75-dies-after-marrying-younger-woman-autopsy/
తమ చావుకు భార్య, ఆమె ప్రియుడు కారణమని ఆరోపిస్తూ వీడియో రికార్డు చేసి సోదరికి పంపి అనంతరం నలుగురు పిల్లలతో కలిసి యమునా నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వీడియో చూసిన సల్మాన్ సోదరి పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన యమునా నది వద్దకు చేరుకున్నారు. సల్మాన్, అతడి పిల్లల కోసం గజ ఈతగాళ్లతో ఆ నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


