Saturday, November 23, 2024
Homeనేషనల్Hydrogen power: ఇంటి ఇంధ‌నం..ఇక హైడ్రోజ‌న్

Hydrogen power: ఇంటి ఇంధ‌నం..ఇక హైడ్రోజ‌న్

ఇంటి మొత్తానికి వంట‌, రూం హీటింగ్‌, గీజ‌ర్లు అన్నింటికీ ఇదే ఇంధ‌నం

వంట‌గ్యాస్ వాడ‌కంతో ఇళ్ల‌లో కాలుష్యం పెరిగిపోతోంద‌న్న విష‌యం ఇప్ప‌టికే రుజువైంది. దానికితోడు, స‌హ‌జ‌వాయువును మండించ‌డం వ‌ల్ల వెలువ‌డే కార్బ‌న్ డ‌యాక్సైడ్ గాల్లో క‌లిసి కార్బ‌న్ ఉద్గారాల‌ను, త‌ద్వారా భూతాపాన్ని (గ్లోబ‌ల్ వార్మింగ్‌) మ‌రింత పెంచుతోంది. దీనికి స‌రైన ప‌రిష్కారంగా భావించి.. ప్ర‌యోగాత్మ‌కంగా హైడ్రోజ‌న్‌ను ఇంటి అవ‌స‌రాల‌కు వాడ‌టం మొద‌లుపెట్టారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ శివార్ల‌లో ఒక ఇంటికి హైహోమ్ అని పేరుపెట్టారు. అంటే ఆ ఇంటి అవ‌స‌రాల‌న్నింటికీ హైడ్రోజ‌నే వాడతార‌న్న‌మాట‌. ఇది ఆస్ట్రేలియాలోనే పూర్తిగా హైడ్రోజ‌న్‌తో న‌డిచే మొట్ట‌మొద‌టి ఇల్లు. దీన్ని ఆస్ట్రేలియ‌న్ గ్యాస్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ గ్రూప్ ప్రారంభించింది. ఆ ఇంట్లో స్నానాల‌కు నీళ్లు వేడి చేసుకోవాల‌న్నా, వంట‌, బార్బిక్యూల‌కు, చ‌లికాలంలో ఇంటిని వేడిగా ఉంచే రూం హీటింగ్ సిస్టంల‌కు.. ఇలా అన్నింటికీ హైడ్రోజ‌నే ఏకైక ఇంధ‌నం! ప్ర‌స్తుతానికి ఈ ఇంటికి ఆన్‌-సైట్ గ్యాస్ ట్యాంకుల ద్వారానే హైడ్రోజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తున్నారు గానీ, గ్యాస్ స‌ర‌ఫ‌రా చేసే పైప్‌లైన్ల ద్వారానే హైడ్రోజ‌న్‌నూ స‌ర‌ఫ‌రా చేయొచ్చు. అంటే, భ‌విష్య‌త్తులో మొత్తం ఇళ్లు అన్నింటికీ 100% హైడ్రోజ‌నే వాడేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్న మాట‌.

- Advertisement -

స్వ‌చ్ఛ ఇంధ‌నం
మనం ఇళ్ల‌లో వాడే స‌హ‌జ‌వాయువు కంటే హైడ్రోజ‌న్ స్వ‌చ్ఛ‌మైన ఇంధ‌నం. ఎందుకంటే, దీన్ని మండించిన‌ప్పుడు అందులోంచి వేడితో పాటు నీటి ఆవిరి వెలువ‌డుతుంది త‌ప్ప కార్బ‌న్ డ‌యాక్సైడ్ అస్స‌లు రాదు. అదే స‌హ‌జ‌వాయువును మండిస్తే కార్బ‌న్ డ‌యాక్సైడ్ వ‌స్తుంది. పైపెచ్చు, హైడ్రోజ‌న్‌కు ఉన్న ల‌క్ష‌ణాల వ‌ల్ల కూడా దీన్ని అత్యంత సుర‌క్షిత ప్ర‌త్యామ్నాయంగా భావిస్తున్నారు. ఇది ఏమాత్రం విష‌పూరితం కాదు. అందువ‌ల్ల ఒక‌వేళ పీల్చిన ప్ర‌మాదం ఉండ‌దు. అంతేకాదు, ఇది గాలి కంటే 14 రెట్లు తేలికైన‌ది. అందువ‌ల్ల ఒక‌వేళ లీకైనా కూడా.. వెంట‌నే పైకి వెళ్లిపోయి, గాల్లో చాలా త్వ‌ర‌గా క‌లుస్తుంది.

కొంత క‌లిపినా మేలేన‌ట‌!
ప్ర‌స్తుతం స‌ర‌ఫ‌రా చేస్తున్న స‌హ‌జ‌వాయువులో కొంత‌మేర హైడ్రోజ‌న్‌ను క‌లిపినా ప‌ర్యావ‌ర‌ణానికి అనుకూలంగానే ఉంటుంద‌ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. దీనివ‌ల్ల స‌హ‌జ‌వాయువు వాడ‌కం కొంత‌మేర త‌గ్గి, త‌ద్వారా కాలుష్యం త‌గ్గుతుంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో వేడిచేయాల్సిన‌చోట పెద్ద మొత్తంలో గ్యాస్ వాడుతుంటారు. అలాంటిచోట హైడ్రోజ‌న్ కొద్ది ప‌రిమాణంలో క‌లిసినా ఆ మేర కాలుష్యం త‌గ్గుముఖం ప‌డుతుంది. ప్యారిస్ ఒడంబ‌డిక‌కు అనుగుణంగా 2050 నాటికి నెట్‌జీరో ల‌క్ష్యాన్ని సాధించాల‌నే ఉద్దేశంతో ఉన్న ప్ర‌పంచ దేశాలు క్ర‌మంగా హైడ్రోజ‌న్ వైపు మొగ్గుతున్నాయి. ఆస్ట్రేలియ‌న్ గ్యాస్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ గ్రూప్ ఇప్ప‌టికే అడిలైడ్‌లో 4వేల క‌నెక్ష‌న్ల‌కు 5% హైడ్రోజ‌న్ క‌లిపిన గ్యాస్ స‌ర‌ఫ‌రా చేస్తోంది.

ఇత‌ర దేశాల్లోనూ ప్ర‌యోగాలు
ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 41 దేశాలు ప్ర‌స్తుతం హైడ్రోజ‌న్ వాడ‌కాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలిస్తున్నాయి. యూకేలో కీల్ యూనివ‌ర్సిటీకి చెందిన హైడిప్లోయ్ పార్ట‌న‌ర్‌షిప్ సంస్థ విజ‌య‌వంతంగా 668 ఇళ్ల‌కు, ఒక పాఠ‌శాల‌కు, ప‌లు వ్యాపార సంస్థ‌ల‌కు, ఒక చ‌ర్చికి కూడా దాదాపు ఏడాది నుంచి 20% హైడ్రోజ‌న్ క‌లిపిన స‌హ‌జ‌వాయువును స‌ర‌ఫ‌రా చేస్తోంది.

స‌వాళ్లు లేక‌పోలేవు
హైడ్రోజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డం అంత సుల‌భ‌మైన ప‌నేమీ కాదు. కాలుష్య ర‌హితంగా హైడ్రోజ‌న్‌ను ఉత్ప‌త్తి చేయాలంటే నీటిని విద్యుత్‌ విశ్లేషణ చేయాలి. అంతేత‌ప్ప మ‌ళ్లీ శిలాజ ఇంధ‌నాల ద్వారా త‌యారుచేస్తే ఆ త‌యారీ ప్ర‌క్రియ‌లోనే కాలుష్యం వెలువ‌డుతుంది. అందువ‌ల్ల హ‌రిత హైడ్రోజ‌న్ త‌యారీ అనేది ప్ర‌స్తుతానికి కొంత ఖ‌రీదైన వ్య‌వ‌హారం. దీనికి పున‌రుత్పాద‌క విద్యుత్తు, పెద్ద‌మొత్తంలో స్వ‌చ్ఛ‌మైన నీరు కావాలి. స‌హ‌జ‌వాయువు కంటే హైడ్రోజ‌న్‌కు సాంద్ర‌త త‌క్కువ‌. అంటే, ఒక‌టే స్థాయి వేడి పుట్టించాలంటే స‌హ‌జ‌వాయువు కంటే ఎక్కువ మొత్తంలో హైడ్రోజ‌న్ అవ‌స‌ర‌మ‌వుతుంది. అంతేకాదు, కొన్నిర‌కాల లోహాల‌కు హైడ్రోజ‌న్ స‌రిప‌డ‌దు. అంటే ఇప్పుడున్న పైప్‌లైన్లు, నిల్వ‌ట్యాంకులు వాడితే గ్యాస్ లీకేజి ప్ర‌మాదం ఉండొచ్చు.

స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించి ముంద‌డుగు
ఇలాంటి కొన్ని స‌మ‌స్య‌లు ఉన్నా కూడా, గ్లోబ‌ల్ వార్మింగ్‌ను అధిగ‌మించాలంటే ఇంధ‌నం విష‌యంలో కొంత ముంద‌డుగు వేయాల్సిందేన‌ని ఆస్ట్రేలియాతో స‌హా ప‌లు దేశాలు భావిస్తున్నాయి. అందుకే స‌వాళ్ల‌ను అధిగ‌మించి మ‌రీ హైడ్రోజ‌న్ వాడ‌కానికి ముందుకొస్తున్నాయి. కాన్‌బెర్రాలో ఇప్ప‌టికే ఉన్న గ్యాస్ పైపులైన్లు అన్నింటి ద్వారా చాలా సుర‌క్షితంగా హైడ్రోజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేయొచ్చ‌ని నిరూపించారు. ఇళ్ల‌కు ఉన్న పైపులైన్లు కూడా హైడ్రోజ‌న్ వాడ‌కానికి స‌రిపోతాయ‌ని చెప్పారు. స‌హ‌జ‌వాయువు లాగే హైడ్రోజ‌న్ కూడా రంగు, వాస‌న లేని వాయువు. అందువ‌ల్ల స‌హ‌జ‌వాయువుకు క‌లిపిన‌ట్లే దీనికి కూడా వాస‌న వ‌చ్చే ప‌దార్థాల‌ను క‌ల‌పాలి. అప్పుడే లీకేజి అయితే తెలుస్తుంది.

ప్ర‌జ‌లేమంటున్నారు
ఇన్నాళ్లూ హైడ్రోజ‌న్ అన‌గానే అది ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, పేలే గుణ‌మున్న వాయువ‌ని ఒక అభిప్రాయం ఉంది. కానీ, స‌హ‌జ‌వాయువు ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో అంత‌కంటే ఎక్కువ ప్ర‌మాద‌క‌రం కాద‌ని శాస్త్రవేత్త‌లు కుండ బ‌ద్ద‌లుకొట్టి మరీ చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని కొన్నిప్రాంతాల్లో ఇప్ప‌టికే 5 నుంచి 20 శాతం వ‌ర‌కు హైడ్రోజ‌న్ క‌లిపిన గ్యాస్ స‌ర‌ఫ‌రా చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో విశ్వాసాన్ని పెంచే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. అయితే, స‌హ‌జ‌వాయువు మండేట‌ప్పుడు నీలిరంగు మంట క‌న‌పడుతుంద‌ని, హైడ్రోజన్ మండితే క‌న‌ప‌డ‌క‌పోవ‌డం వ‌ల్ల వంట చేసేట‌ప్పుడు కాస్త గంద‌రోగ‌ళం ఉంటుంద‌ని కొంద‌రు చెబుతున్నారు. గీజ‌ర్ల‌కు, రూం హీటింగ్ వ్య‌వ‌స్థ‌ల‌కు ఈ స‌మ‌స్య ఉండ‌బోదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News