IAF Chief on Operation Sindoor : ఒక యుద్ధాన్ని ఎలా ప్రారంభించాలో కాదు, ఎలా ముగించాలో తెలియడమే అసలైన వ్యూహం. ఈ విషయంలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని, ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పామని భారత వాయుసేన (ఐఏఎఫ్) అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ ఉద్ఘాటించారు. స్పష్టమైన లక్ష్యంతో దాడి చేసి, అది నెరవేరగానే ముగించి శాంతిని నెలకొల్పిన ఘనత భారత్‌దని ఆయన అన్నారు. అసలు ఈ మెరుపువేగ విజయం వెనుక ఉన్న రహస్యమేంటి? పాకిస్థాన్‌ను భారత్ అంత త్వరగా ఎలా మోకరిల్లేలా చేసింది? ప్రపంచానికి వాయుసేన అధిపతి ఇచ్చిన సందేశం ఏమిటి?
‘ఆపరేషన్ సిందూర్’ భారత సైనిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక అధ్యాయమని, ఇది ప్రపంచ దేశాలకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుందని ఐఏఎఫ్ చీఫ్ ఏపీ సింగ్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా మధ్య ఏళ్ల తరబడి యుద్ధాలు కొనసాగుతున్నాయని, వాటికి ముగింపు ఎప్పుడో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని ఆయన గుర్తుచేశారు. కానీ, భారత్ అలా కాదని స్పష్టం చేశారు.
“‘ఆపరేషన్ సిందూర్’ను మేము ఒక స్పష్టమైన లక్ష్యంతో ప్రారంభించాం. దానిని అనవసరంగా పొడిగించకుండా, లక్ష్యం నెరవేరిన వెంటనే ముగించాం. మా దాడుల తీవ్రతకు పాకిస్థాన్ తట్టుకోలేక కాల్పుల విరమణ కోసం అడిగేలా చేశాం. మా నిర్దేశిత లక్ష్యాలు నెరవేరడంతో మేము కూడా అందుకు అంగీకరించాం. ఒక యుద్ధాన్ని ఎలా ముగించాలో ప్రపంచం మమ్మల్ని చూసి నేర్చుకోవాలి,” అని ఏపీ సింగ్ వ్యాఖ్యానించారు.
శత్రుదేశానికి చుక్కలు చూపిన వైనం: ఆపరేషన్ సిందూర్ సమయంలో త్రివిధ దళాల సమన్వయంతో పాకిస్థాన్‌కు చెందిన 10 ఫైటర్ జెట్‌లను ధ్వంసం చేసినట్లు ఏపీ సింగ్ వెల్లడించారు. వాటిలో అత్యాధునిక ఎఫ్-16, జేఎఫ్-17 యుద్ధ విమానాలు కూడా ఉన్నాయని తెలిపారు. భారత సైన్యం గురిచూసి కొట్టిన దెబ్బకు పాక్‌లోని ఉగ్రస్థావరాలతో పాటు, వారి రాడార్ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రన్‌వేలు, యుద్ధ విమానాలు సర్వనాశనమయ్యాయని ఆయన వివరించారు. ఈ ఆపరేషన్‌లో కేంద్ర ప్రభుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వడంతో, మన సైనికులు శత్రుదేశానికి చుక్కలు చూపించారని, ఫలితంగా పాకిస్థాన్ కాల్పుల విరమణ కోసం కాళ్ల బేరానికి వచ్చిందని పేర్కొన్నారు. ఇస్లామాబాద్ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకే, మరే ఇతర దేశం జోక్యం లేకుండానే తాము కాల్పుల విరమణకు అంగీకరించామని స్పష్టం చేశారు.
భవిష్యత్ భద్రతకు ‘సుదర్శన్ చక్ర’: భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రక్షణ రంగంలో స్వావలంబన అత్యంత కీలకమని ఏపీ సింగ్ అన్నారు. ఇందులో భాగంగా, దేశీయంగా ‘సుదర్శన్ చక్ర’ అనే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను త్రివిధ దళాలు కలిసి అభివృద్ధి చేస్తున్నాయని తెలిపారు. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 వ్యవస్థలు కూడా ఆపరేషన్ సిందూర్‌లో సమర్థవంతంగా పనిచేశాయని ఆయన పేర్కొన్నారు. ‘రోడ్ మ్యాప్ 2047’తో భారత వాయుసేన భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోందని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యం: ఏప్రిల్ 22న కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా, మే 7న భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను, సైనిక వనరులను నేలమట్టం చేసింది. భారత్ దాడుల ఉద్ధృతికి భయపడిన పాకిస్థాన్, కాల్పుల విరమణ కోసం అభ్యర్థించడంతో మే 10న ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.


