Saturday, November 15, 2025
Homeనేషనల్IAF Fighter Jet: గగనతల గర్జనకు సెలవు... 62 ఏళ్ల మిగ్-21 ప్రస్థానానికి వీడ్కోలు!

IAF Fighter Jet: గగనతల గర్జనకు సెలవు… 62 ఏళ్ల మిగ్-21 ప్రస్థానానికి వీడ్కోలు!

MIG-21 Retirement: భారత వాయుసేన గగనతలంలో అరవై రెండేళ్లుగా ఓ యోధుడిలా గర్జిస్తూ, శత్రువుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఆకాశవీరుడు, మిగ్-21 యుద్ధ విమానం ఇకపై శాశ్వతంగా విశ్రాంతి తీసుకోనుంది. భారత వైమానిక దళానికి (IAF) తొలి సూపర్‌సోనిక్ వేగాన్ని పరిచయం చేసి, ఎన్నో యుద్ధాల్లో దేశానికి గెలుపు మాలలు వేసిన ఈ చారిత్రక యుద్ధ విమాన శకానికి ముగింపు పలకాలని వాయుసేన కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, ఒకప్పుడు హీరోగా కీర్తించబడిన ఇదే విమానం, కాలక్రమేణా ‘ఎగిరే శవపేటిక’ (ఫ్లయింగ్ కాఫిన్) అనే అపప్రదను ఎందుకు మూటగట్టుకుంది..? దాని స్థానంలో రాబోయే వారసుడు ఎవరు..? 

- Advertisement -

చారిత్రక ప్రస్థానానికి ఘన వీడ్కోలు:

రక్షణశాఖ వర్గాల సమాచారం ప్రకారం, సుమారు 62 సంవత్సరాల సుదీర్ఘ సేవలు అందించిన మిగ్-21 విమానాలకు 2025 సెప్టెంబర్ 19న చండీగఢ్ ఎయిర్‌బేస్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా అధికారికంగా వీడ్కోలు పలకనున్నారు.ఈ చారిత్రక ఘట్టానికి వైమానిక దళ ఉన్నతాధికారులు, మిగ్-21 నడిపిన మాజీ యుద్ధ వీరులు, పైలట్లు హాజరయ్యే అవకాశం ఉంది.ఈ కార్యక్రమంలో మిగ్-21 చివరిసారిగా గగన విన్యాసాలు చేసే ఫ్లై-పాస్ట్, స్టాటిక్ డిస్‌ప్లే కూడా ఏర్పాటు చేయనున్నారు.

ALSO READ:https://teluguprabha.net/national-news/vice-president-election-process-india-explained/

గెలుపుల యోధుడు.. యుద్ధక్షేత్రపు సింహం:

1963లో భారత వైమానిక దళంలో అడుగుపెట్టిన మిగ్-21, IAFలో చేరిన మొట్టమొదటి సూపర్‌సోనిక్ యుద్ధ విమానంగా చరిత్ర సృష్టించింది. ఇది 1960లు, 70లలో భారత్‌కు సాంకేతికంగా తిరుగులేని ఆధిపత్యాన్ని అందించింది. అప్పటి నుండి జరిగిన ప్రతి ప్రధాన యుద్ధంలోనూ ఇది తన సత్తా చాటింది.

1965 పాకిస్తాన్‌తో యుద్ధం
1971 బంగ్లాదేశ్ విముక్తి సంగ్రామం
1999 కార్గిల్ యుద్ధం
2019 బాలాకోట్ వైమానిక దాడులు
ఒకానొక దశలో, భారత వాయుసేన వద్ద 850కి పైగా మిగ్-21 విమానాలు ఉండేవి, వాటిలో 600కు పైగా హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) మన దేశంలోనే తయారు చేయడం విశేషం.

కీర్తి కిరీటంలో… విషాదపు మరక:

ఎంతటి కీర్తిప్రతిష్టలు ఉన్నప్పటికీ, కాలం గడిచేకొద్దీ సాంకేతికంగా వెనుకబడిన మిగ్-21 విమానాలు తరచుగా ప్రమాదాలకు గురవడం మొదలైంది.ఈ ప్రమాదాల్లో అనేక మంది పైలట్లు ప్రాణాలు కోల్పోవడంతో, ఈ ఫైటర్ జెట్‌కు ‘ఫ్లయింగ్ కాఫిన్’ అనే చేదు పేరు స్థిరపడింది.అయినప్పటికీ, వేలాది మంది పైలట్లకు శిక్షణ ఇవ్వడంలో మరియు వారికి యుద్ధ క్షేత్ర అనుభవాన్ని అందించడంలో ఈ విమానం ఒక శిక్షణాలయంగా నిలిచింది.

ALSO READ: https://teluguprabha.net/national-news/indian-railways-revises-emergency-quota-rules/

వారసుడి రాకలో జాప్యం.. తగ్గుతున్న స్క్వాడ్రన్లు:

భారత వైమానిక దళంలో ఒకప్పుడు కీలకమైన మిగ్-21 యుద్ధ విమానాల శకం ముగుస్తోంది. వాటి స్థానంలో, భారతదేశం సొంతంగా రూపొందించిన తేజస్ Mk-1A తేలికపాటి యుద్ధ విమానాలను మోహరిస్తున్నారు


 అయితే, తేజస్ విమానాల ఉత్పత్తి  డెలివరీలో  జాప్యం కారణంగా, మిగ్-21 సేవలను పలుమార్లు పొడిగించాల్సి వచ్చింది. ఇప్పుడు మిగ్-21 వీడ్కోలుతో, భారత వైమానిక దళంలోని యుద్ధ స్క్వాడ్రన్ల సంఖ్య కేవలం 29కి పడిపోతుంది, ఇది గత కొన్ని దశాబ్దాలలో అత్యంత తక్కువ. IAF చరిత్రలో మూడింట రెండు వంతుల కాలం పాటు సేవలందించిన ఘనత మిగ్-21ది. ఇది కేవలం ఒక యుద్ధ విమానం కాదు, భారత సైనిక పటిమకు, ధైర్యసాహసాలకు, సాంకేతిక ప్రస్థానానికి ఒక ప్రతీక. మిగ్-21 ఇక ఆకాశంలో ఎగరకపోయినా, దాని గాథలు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad