Supreme Court: ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలతో ప్రాణ, ఆస్తినష్టాలు సంభవిస్తున్నాయి. కాగా.. ఈ విపత్తులపై దృష్టిసారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమంగా చెట్లను నరికివేస్తుండటం వల్లే పంజాబ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రకృతి విలయం సృష్టిస్తోందని వ్యాఖ్యానించింది. వరుస విపత్తులతో కొండ ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యం క్షీణిస్తుండటంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని విచారించిన సుప్రీం ధర్మాసనం.. ఇది తీవ్రమైన అంశమని పేర్కొంది. దీనిపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో సంభవిస్తోన్న ప్రకృతి విపత్తులను మనం చూస్తున్నాం. కొండ ప్రాంతాల్లో అక్రమంగా చెట్లు నరుకుతున్నట్లు మీడియాలో వస్తోన్న కథనాలతో ప్రాథమికంగా స్పష్టమైన ఆధారాలున్నాయి. వరద నీటిలో భారీ స్థాయిలో దుంగలు తేలియాడుతున్నట్లు ఆ వార్తల్లో గమనించాం’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. కేంద్రం, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే సంబంధిత అధికారులను సంప్రదించి ఆ స్థాయిలో దుంగలు నీటిలో తేలియడానికి గల కారణాలను తెలుసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. రెండు వారాల తర్వాత ఈ అంశంపై విచారణ జరగనుంది.
Read Also: Revanth Reddy: క్రైసిస్ మేనేజ్ మెంట్ పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఉత్తరాదిలో వర్షాలు
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో పలుమార్లు క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఈ విపత్తులో భారీసంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కొండచరియలు విరిగిపడుతుండగా, పంజాబ్‌లోనూ వరదలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. దిల్లీకి వరద ముప్పు క్రమంగా పెరుగుతోంది. నిరాశ్రయుల కోసం ఏర్పాటుచేసిన శిబిరాలే వరద నీటిలో చిక్కుకుపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నది ఉప్పొంగుతోంది. దాంతో మయూర్ విహార్ ఫేజ్-1 ప్రాంతం నీట మునిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దిల్లీ(Delhi) పాత రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో యమునా నది గురువారం ఉదయం 7 గంటల సమయానికి 207.48 మీటర్ల మేర ప్రవహిస్తోంది. 5 గంటల సమయంలో ఇది 207.47గా ఉంది. నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలీపుర్ ప్రాంతంలో రోడ్డు పైనే లోతుగా గొయ్యి ఏర్పడింది. సివిల్ లైన్స్ ప్రాంతంలో కార్లు నీట మునిగాయి. బేలా రోడ్‌లోని భవనాల్లోకి వరద(Flood) నీరు ప్రవేశించింది. కశ్మీర్ గేట్ పరిసరాల్లోనూ వర్షం నీరు నిలిచిపోయింది. దిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. యమునాలో నీటి మట్టం పెరగడం రాజధాని వ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. ప్రధానంగా తీర ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీధులు, ఇళ్లు, ఆశ్రయం పొందుతున్న శిబిరాలు అనే తేడా లేకుండా వరద నీరు ముంచెత్తింది. యమునా బజార్, నజాఫ్‌గఢ్, జైత్పూర్‌లో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు ఐదుగురిని రక్షించామని, 626 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించామని ఎన్డీఆర్ఎఫ్ పేర్కొంది. 13 పశువులను కూడా రక్షించినట్లు ఎక్స్‌లో పోస్టు పెట్టింది.
Read Also: Nimmala: కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించి మంత్రి నిమ్మల


