వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా రుతుపవనాలు బాగానే కురుస్తాయని ప్రకటించింది. సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ (IMD) చీఫ్ తెలిపారు. జూన్-సెప్టెంబర్ మధ్య దేశం మొత్తం మీద 105 శాతం వర్షపాతం ఉండే అవకాశం ఉందని చెప్పారు. సాధారణంగా 87 సెంటీమీటర్ల వర్షం పడుతుందని, ఈసారి మరింత ఎక్కువ వర్షం పడుతుందని వివరించారు.
ఎల్ నినో, హిందూ మహాసముద్ర ద్విధ్రువ పరిస్థితులు ఈసారి అనుకూలంగా ఉన్నాయని IMD పేర్కొంది. ఈ వాతావరణ మార్పుల వల్ల దేశంలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని నిపుణులు అంటున్నారు. యురేషియా ప్రాంతం, హిమాలయ పరిసరాల్లో మంచు తక్కువగా ఉండటం కూడా మంచి పరిణామం అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. హిమాలయాల్లో మంచు తగ్గడం వల్ల భారత ఉపఖండంలో రుతుపవనాలు బాగా కురుస్తాయని వివరిస్తున్నారు. అయితే లడఖ్, ఈశాన్య భారతదేశం, తమిళనాడుల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు పడే అవకాశముందని IMD స్పష్టం చేసింది.
ఈ వర్షపాతం అంచనాలు రైతులకు మంచి ఊరట కలిగిస్తాయి. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు ఉపశమనం కలుగుతుంది. సాధారణంగా జూన్ చివరి వారంలో లేదా జూలై 1నాటికి రుతుపవనాలు కేరళ తీరానికి చేరుకుంటాయి. తరువాత దేశం మొత్తం మీద వ్యాపిస్తాయి.
అంతేకాక, ఏప్రిల్ నుండి జూన్ వరకు వేడి గాలులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తక్కువ రోజుల్లోనే వర్షాలు పడటంతో, ఆ తరువాత ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. రైతన్నలు ఆకాశం వైపు ఆశగా చూడాల్సిన అవసరం లేదని, వర్షాలు బాగా కురిసి పంటలు పుష్కలంగా పండుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.