Saturday, November 15, 2025
Homeనేషనల్Maoist-Free Village: 25 ఏళ్ల తర్వాత స్వేచ్ఛా వాయువులు.. మావోయిస్టు రహిత గ్రామంలో తొలిసారి 'ఎన్నికల...

Maoist-Free Village: 25 ఏళ్ల తర్వాత స్వేచ్ఛా వాయువులు.. మావోయిస్టు రహిత గ్రామంలో తొలిసారి ‘ఎన్నికల పండుగ’!

Maoist-Free Village To Vote For First Time In 25 Years: బీహార్‌లోని జముయి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ (మంగళవారం) జరగనుంది. కానీ ఈ జిల్లాలోని చార్‌మారా అనే చిన్న గ్రామంలో అసలైన వార్త ఎన్నికలు కాదు, ఓటు వేయడం!

- Advertisement -

రాష్ట్రంలోని చాలా మందికి ఇది సాధారణమైన ప్రజాస్వామ్య ప్రక్రియ కావచ్చు, కానీ ఇక్కడి ప్రజలకు మాత్రం ఇది 25 ఏళ్ల తర్వాత దక్కిన ఒక అద్భుతం, ఒక పండుగ. పావు శతాబ్దానికి పైగా హింస, మరణాలు, భయం నీడన బతికిన ఈ గ్రామ ప్రజలు, తొలిసారిగా శాంతియుతంగా ఓటు వేయడానికి సిద్ధమయ్యారు.

భయం గుప్పిట్లో గతం

దశాబ్దాలుగా, ఈ ప్రాంతం మొత్తం మావోయిస్టుల నియంత్రణలో ఉండేది. హత్యలు, హింస ఇక్కడ నిత్యకృత్యం. భయానక వాతావరణం కారణంగా స్థానికులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఇళ్ల నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే వణికిపోయేవారు. ఈ గ్రామం బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయింది.

కానీ కేంద్ర ప్రభుత్వ బలగాల మోహరింపు, నిరంతర ఆపరేషన్ల తర్వాత నేడు ఆ చిత్రం పూర్తిగా మారిపోయింది. “2026 నాటికి భారత్ నుండి నక్సలిజాన్ని తుడిచిపెడతాం” అని హోం మంత్రి అమిత్ షా గతంలో చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఇక్కడ శాంతి నెలకొంది.

మాజీ కమాండర్ కుటుంబంలో ఆనందం

ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఒకప్పుడు ఇదే ప్రాంతంలో తీవ్రవాద పాలన నడిపిన మావోయిస్టు కమాండర్ బాలేశ్వర్ కోడా కుమారుడు సంజయ్ కోడా ఇప్పుడు అదే పోలింగ్ బూత్‌ను ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నాడు.

“అవును, మా నాన్న మావోయిస్టు కమాండర్. గ్రామంలో చాలా భయం ఉండేది. అందరూ ఆయనంటే భయపడేవారు… నాకు కూడా భయంగానే ఉండేది. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని చంపుతారో తెలియదు. కానీ ఈ రోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎన్నికల కోసం పోలింగ్ బూత్‌ను నేనే స్వయంగా సిద్ధం చేస్తున్నాను,” అని సంజయ్ కోడా అన్నారు. అంతేకాదు, బాలేశ్వర్ కోడా కోడలు (సంజయ్ భార్య) ఇప్పుడు అదే చార్‌మారా పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు.

“మేము భయంతోనే బతికాం. మా మామగారు లొంగిపోయి జైలులో ఉన్నారు. ఇప్పుడు రేపు ఓటు వేయబోతున్నాం. ఇది మాకు పండుగ కంటే తక్కువ కాదు,” అని ఆమె ఆనందంగా చెప్పారు.

ALSO READ: Women’s Reservation Act: ‘మహిళలే అతి పెద్ద మైనారిటీ’.. రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

బాంబులు పడ్డ చోటే పోలింగ్ బూత్!

గతంలో, చార్‌మారా గ్రామస్తులు ఓటు వేయాలంటే, భయంతోనే సుమారు 22 కిలోమీటర్లు ప్రయాణించి బర్హత్ బ్లాక్‌లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు, వారి గ్రామంలోనే పోలింగ్ స్టేషన్ నంబర్ 220ని ఏర్పాటు చేశారు.

విశేషమేమిటంటే, ఒకప్పుడు మావోయిస్టులు బాంబులతో పేల్చివేసిన చార్‌మారా ప్రాథమిక పాఠశాలనే ప్రభుత్వం పునర్నిర్మించింది. ఇప్పుడు అదే పాఠశాలలో గ్రామస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇది మావోయిస్టుల హింసపై ప్రజాస్వామ్యం సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తోంది.

గ్రామంలోని అత్యంత వృద్ధుడైన నివాసి మాట్లాడుతూ, “రాత్రికి రాత్రే ప్రజలను ఎత్తుకెళ్లేవారు. పిల్లలను బలవంతంగా ఉద్యమంలో చేర్చుకునేవారు. కుటుంబాలు ప్రతిరోజూ భయంతో బతికాయి. కానీ దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామానికి మళ్లీ ఆశ కలిగింది.”

గ్రామాన్ని ‘మావోయిస్టు-రహితం’గా ప్రకటించినప్పటికీ, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలోని ప్రతి మూలలోనూ పహారా కాస్తూ, శాంతియుత పోలింగ్‌కు భరోసా ఇస్తున్నారు.

ALSO READ: Delhi Bomb Blast: పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad