అహ్మదాబాద్(తెలుగుప్రభ): దేశంలో విమానయాన రంగాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రణాళికను చేపట్టిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రాంతీయ విమాన కనెక్టివిటీ పథకం ‘ఉడాన్’ కింద రానున్న పదేళ్లలో దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలను నిర్మించేందుకు సుమారు రూ.30 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి సమక్షంలో దేశంలో మూడో ‘హబ్ అండ్ స్పోక్’ విమాన కార్యకలాపాలను రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 166కు చేరిందని తెలిపారు. గత 12 ఏళ్లలో దాదాపు ప్రతి 40 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం లేదా కొత్త టెర్మినల్ నిర్మాణం పూర్తిచేసిన ఘనతను భారత్ సాధించిందన్నారు. విమానయాన రంగంలో ఉడాన్ పథకం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, రాబోయే పదేళ్లలో ఈ రంగాన్ని మరింత విస్తరించనున్నామని చెప్పారు. 2026-27 నుంచి 2035-36 ఆర్థిక సంవత్సరాల వరకు పదేళ్లపాటు ‘మోడిఫైడ్ ఉడాన్’ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం రూ.28,840 కోట్ల వ్యయానికి ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య పెంచడం మాత్రమే కాకుండా.. వాటిని దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలతో సమర్థవంతంగా అనుసంధానించడం కూడా అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. ఈ లక్ష్యంతోనే హబ్ అండ్ స్పోక్ మోడల్‌ను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ విధానం ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రయాణికులు భారతీయ హబ్ విమానాశ్రయాల ద్వారా అంతర్జాతీయ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుందన్నారు.
ఇప్పటికే వారణాసి, అమృత్‌సర్‌లో ఈ విధానాన్ని ప్రారంభించగా మంచి స్పందన లభించిందని తెలిపారు. గుజరాత్, అహ్మదాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నందున అంతర్జాతీయ కనెక్టివిటీ కోసం ఈ ప్రాంతం నుంచి నిరంతరం విజ్ఞప్తులు వస్తున్నాయని.. అందుకే అహ్మదాబాద్‌ను మూడో కేంద్రంగా ఎంపిక చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ప్రజల అవసరాలు కూడా మారుతున్నాయని రామ్మోహన్ నాయుడు అన్నారు. కేవలం రైల్వే స్టేషన్ లేదా రైలు సౌకర్యం మాత్రమే కాకుండా తమ ప్రాంతంలోనే విమానాశ్రయం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ డిమాండ్ కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదని.. టైర్-2, టైర్-3 నగరాలు, హిమాలయ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, లక్షద్వీప్, అండమాన్ వంటి ద్వీప ప్రాంతాల నుంచి కూడా విమానాశ్రయాల కోసం డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పౌర విమానయాన రంగం ఒకటని మంత్రి పేర్కొన్నారు. విమానాశ్రయాల అభివృద్ధి ద్వారా ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలు భారీగా పెరుగుతాయని చెప్పారు. విమానయాన రంగం పురోగతి అంటే దేశం మొత్తం పురోగతి సాధించడమేనని రామ్మోహన్ నాయుడు అన్నారు.జాతీయ పౌర విమానయాన విధానంలో గుజరాత్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.

