Budget2026 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (ఫిబ్రవరి 1, 2026) లోక్‌సభలో చారిత్రాత్మక మార్పులతో కూడిన కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టారు. దశాబ్దాల కాలం నాటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో, ఆధునిక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ‘ఆదాయపు పన్ను చట్టం, 2025’ రానున్న ఏప్రిల్ 1, 2026 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని ఆమె ప్రకటించారు. సామాన్యులకు పన్ను చెల్లింపులు భారంగా కాకుండా, సులభంగా ఉండేలా ఈ నూతన చట్టంలో అనేక సంస్కరణలు చేపట్టారు.
Union Budget 2026-27: యువశక్తికి పట్టాభిషేకం… ఆర్థికానికి మూడు సూత్రాలు!
రిటర్నుల దాఖలు గడువు పెంపు
- సవరించిన రిటర్నులు: పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో సవరించిన (Revised) రిటర్నులను దాఖలు చేయడానికి డిసెంబర్ 31 వరకు మాత్రమే గడువు ఉండేది. ఈ గడువును ఇప్పుడు మార్చి 31 వరకు పొడిగించారు. దీనివల్ల పొరపాట్లు సరిదిద్దుకోవడానికి ఇన్వెస్టర్లకు, ట్యాక్స్ పేయర్లకు అదనపు సమయం లభిస్తుంది.
- సరళతరమైన ఫారాలు: సామాన్యులు కూడా సొంతంగా పన్ను ఫైల్ చేసేలా ఐటీ రిటర్న్ ఫారాలను మరింత సులభతరం చేయనున్నారు. కొత్త డిజైన్లతో కూడిన ఫారాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.
విదేశీ ప్రయాణాలు , చదువులపై పన్ను తగ్గింపు
- టీసీఎస్ (TCS) తగ్గింపు: విదేశాలకు వెళ్లే వారికి, అక్కడ చదువుకునే విద్యార్థులకు నిర్మలమ్మ తీపి కబురు అందించారు. విదేశీ టూర్ ప్యాకేజీలు, విదేశీ విద్య , వైద్యం కోసం పంపే నగదుపై గతంలో ఉన్న 5 శాతం టీడీఎస్/టీసీఎస్‌ను ఇప్పుడు 2 శాతానికి తగ్గించారు.
- విదేశీ ఆస్తులు: ఇక నుంచి ఎవరైనా విదేశాల్లో ఆస్తులు కలిగి ఉంటే, వాటి వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ విషయంలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కంపెనీల బైబ్యాక్ విధానంపై పన్ను భారం
- కార్పొరేట్ బైబ్యాక్: కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. షేర్ల బైబ్యాక్ (Buyback) ద్వారా వచ్చే లాభాలపై కొత్త పన్నులను విధించారు. కంపెనీల బైబ్యాక్ కొనుగోళ్లపై 2 శాతం అదనపు పన్ను విధించారు.
- నాన్-కార్పొరేట్ బైబ్యాక్: ప్రమోటర్లు లేదా కార్పొరేట్ కాని వారు జరిపే బైబ్యాక్ కొనుగోళ్లపై ఏకంగా 30 శాతం పన్ను విధించారు. ఇది ఇన్వెస్టర్లపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.
క్రిమినల్ చర్యల తీవ్రత తగ్గింపు
- శిక్ష తగ్గింపు: పన్ను వివాదాల్లో చిక్కుకున్న వారికి ఊరటనిస్తూ, జైలు శిక్షల విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించింది. పన్ను వివాదాల్లో గతంలో ఉన్న కఠినమైన జైలు శిక్షలను ఇప్పుడు గరిష్టంగా రెండేళ్లకు పరిమితం చేశారు.
- జరిమానా చెల్లింపు: ఒకవేళ పన్ను చెల్లింపుదారుడు తప్పును ఒప్పుకుని, జరిమానా (Penalty) చెల్లిస్తే ఆ జైలు శిక్ష నుంచి పూర్తిగా మినహాయింపు లభిస్తుంది.
ఇతర ముఖ్యాంశాలు
- రహదారి ప్రమాదాల పరిహారం: రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు లభించే పరిహారంపై వచ్చే వడ్డీకి ఇకపై పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.
- చిన్న మొత్తాల పన్ను: తక్కువ పన్ను చెల్లించే వారి కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకురానున్నారు.
- టీడీఎస్ మార్పులు: మానవ వనరుల సరఫరా (Manpower Supply) సంస్థలపై టీడీఎస్‌ను 1 లేదా 2 శాతానికి పరిమితం చేశారు.
Healthcare budget : క్యాన్సర్‌పై కవచం.. ఫార్మా రంగానికి శక్తి! బయో-ఫార్మా శక్తితో సరికొత్త విప్లవం

