Madras High Court sensational verdict: భరణం విషయంలో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. భార్యకు అధిక ఆదాయం ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇటీవల భరణం ఇవ్వాలని ఆదేశించిన ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను మద్రాసు హైకోర్టు రద్దు చేసింది.
దంపతులకు ఓ కుమారుడు అయినా సరే: వివరాల్లోకి వెళ్తే చెన్నైకి చెందిన వైద్య దంపతులకు విభేదాలు తలెత్తాయి. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. అయినా సరే ఆ భార్యాభర్తలు విడాకులు కోరుతూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో కేసు దాఖలుచేశారు. విచారణ అనంతరం ఫ్యామిలీ కోర్టు భార్యకు నెలకు రూ.30 వేలు భరణంగా ఇవ్వాలని భర్తకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆ వైద్యుడు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
భార్యకు అధిక ఆదాయం ఉంటే భరణం అవసరం ఏంటీ?: ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేసింది. వారి కుమారుడు నీట్ కోసం సిద్ధమవుతున్నాడు కాబట్టి… అతని చదువుకయ్యే ఖర్చుగా రూ.2.77 లక్షలు ఇవ్వడానికి పిటిషనర్ అంగీకరించారని జస్టిస్ బాలాజీ బుధవారం జారీచేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. అదే సమయంలో పిటిషనర్ భార్యకు అధికంగా ఆస్తులు, ఆదాయం ఉన్నాయని.. ఆమె స్కానింగ్ సెంటర్ నడుపుతున్నట్లు తెలుపుతూ సంబంధిత పత్రాలను దాఖలు చేశారని తెలిపారు. కాబట్టి పిటిషనర్ తన భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది.
ఆ విషయంలో జోక్యం చేసుకోలేం: కుమారుడి చదువుకు డబ్బులు ఇచ్చే విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోదంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన మిగితా ఉత్తర్వులను రద్దు చేసింది. భరణం చెల్లింపు అనేది భార్య, భర్తల ప్రస్తుత ఆదాయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది మద్రాసు హైకోర్టు తెలిపింది. భార్యకు అధిక ఆదాయం ఉంటే, భర్త భరణం చెల్లించనవసరం లేదని తెల్పింది.
లింగ సమానత్వంపై కొత్త చర్చకు దారితీసిన తీర్పు: ఒక వ్యక్తికి జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి గట్టెక్కడానికి భరణం ఉద్దేశించబడింది. కానీ దాన్ని ఆదాయ వనరుగా చూడకూడదని మద్రాసు హైకోర్టు పేర్కొంది. ఈ భరణం కేసులలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు… లింగ సమానత్వంపై కొత్త చర్చకు దారితీసింది. అంటే.. ఒకప్పుడు భర్త మాత్రమే భరణం చెల్లించాలనే నియమం ఇప్పుడు ఆదాయంపై ఆధారపడి ఉంటుందని ఈ తీర్పు సూచిస్తుంది.


