India-Afghanistan diplomatic engagement : అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక భారత్‌తో సంబంధాలు దాదాపు తెగిపోయినట్టేనని భావిస్తున్న వేళ, అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్‌తో సరిహద్దు ఘర్షణలతో కయ్యానికి కాలుదువ్వుతున్న తరుణంలో, అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఏకంగా భారత పర్యటనకు వచ్చారు. అసలు తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి పర్యటన వెనుక వ్యూహమేంటి..? దిల్లీ వేదికగా దౌత్య సంబంధాలు మళ్లీ చిగురిస్తున్నాయా..?
భారత్-అఫ్గానిస్థాన్ మధ్య సంబంధాలు భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా ఉంటాయని అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ బలమైన ఆశాభావం వ్యక్తం చేశారు. తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత ఆ దేశానికి చెందిన ఓ మంత్రి భారత్‌లో అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కీలక చర్చలు జరపడమే కాకుండా, ఉత్తరప్రదేశ్‌లోని ప్రఖ్యాత ఇస్లామిక్ సెమినరీ ‘దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్’ను కూడా సందర్శించారు. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య బలపడుతున్న దౌత్య సంబంధాలకు ప్రతీకగా నిలుస్తోంది.
జైశంకర్‌తో కీలక భేటీ : అక్టోబర్ 10న దిల్లీలో విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ముత్తాఖీ సమావేశమయ్యారు. ఈ భేటీలో పరస్పర ప్రయోజనకరమైన అంశాలు, ప్రాంతీయ పరిణామాలు, వాణిజ్యం, భద్రత, సాంస్కృతిక సహకారంపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ఆరోగ్యం, ప్రజా మౌలిక సదుపాయాల రంగాల్లో అఫ్గానిస్థాన్‌కు భారత్ అందిస్తున్న అభివృద్ధి సహకారాన్ని ముత్తాఖీ ప్రశంసించారు. ఇటీవల కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడిని అఫ్గానిస్థాన్ తీవ్రంగా ఖండించినందుకు జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఇరువురు మంత్రులు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో, అఫ్గాన్ ప్రజలతో భారత్‌కు ఉన్న చారిత్రక, సాంస్కృతిక స్నేహబంధాన్ని జైశంకర్ పునరుద్ఘాటించారు. అఫ్గాన్ ప్రజల ఆకాంక్షలకు, అభివృద్ధికి భారత్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
దేవ్‌బంద్‌లో ఘనస్వాగతం : తన పర్యటనలో భాగంగా ముత్తాఖీ శనివారం ఉత్తరప్రదేశ్‌లోని సహారాన్‌పూర్‌లో గల ‘దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్’ సెమినరీని సందర్శించారు. అక్కడ ఆయనకు ఉలేమాలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నాకు లభించిన ఆత్మీయ స్వాగతానికి కృతజ్ఞతలు. భారత్-అఫ్గాన్ సంబంధాలు భవిష్యత్తులో మరింత మెరుగ్గా ఉంటాయి,” అని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఆయన తాజ్‌మహల్‌ను కూడా సందర్శించనున్నారు.
మారిన పరిస్థితులే కారణమా : 2021లో అమెరికా సైన్యం వైదొలగిన తర్వాత అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు వశం చేసుకున్నప్పటి నుంచి భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. అయితే, మానవతా సాయం కింద ఆహారం, మందులను అందిస్తూనే ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్‌తో ఘర్షణల నేపథ్యంలో, తాలిబన్లు భారత్‌తో ఆర్థిక, దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు. అఫ్గాన్ అభివృద్ధిలో భారత్ కీలక పెట్టుబడిదారుగా ఉన్నందున, ఈ పర్యటన ద్వారా వాణిజ్య, పెట్టుబడి మార్గాలను అన్వేషించడమే లక్ష్యంగా కనిపిస్తోంది.


