భారీ భూకంపం ధాటికి మయన్మార్ తీవ్రంగా నష్టపోయింది. శుక్రవారం రాత్రి 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి, 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్తు సమయంలో మయన్మార్‌కు సాయం చేసేందుకు భారత్ స్నేహ హస్తం అందించింది. ‘‘ఆపరేషన్ బ్రహ్మ’’ పేరిట భారత ప్రభుత్వం సహాయక చర్యలను ప్రారంభించింది.
శనివారం భారత వైమానిక దళానికి చెందిన C130J సైనిక రవాణా విమానం హిండన్ ఎయిర్‌బేస్ నుంచి మయన్మార్ బయలుదేరింది. దీనితో పాటు 15 టన్నుల అత్యవసర సహాయ సామాగ్రిని పంపిణీ చేశారు. ఇందులో టెంట్లు, దుప్పట్లు, తినడానికి సిద్ధమైన ఆహారం, వాటర్ ప్యూరిఫైయర్లు, సోలార్ లైట్లు, జనరేటర్లు, మెడిసిన్స్ ఉన్నాయి. భారత నౌకాదళానికి చెందిన రెండు నౌకలు సహాయక సామాగ్రితో మయన్మార్‌కు చేరుకున్నాయి.
రక్షణ చర్యల్లో భారత బృందం ఈ సహాయ చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం కీలక పాత్ర పోషిస్తోంది. కాంక్రీట్ కట్టర్లు, డ్రిల్లింగ్ మెషీన్లు, ప్లాస్మా కట్టింగ్ టూల్స్, సుత్తెలు వంటి అత్యాధునిక పరికరాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టనుంది. ఇక మయన్మార్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రత కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరంతరం చర్యలు తీసుకుంటోంది. అవసరమైన భారతీయులు అత్యవసర సహాయం కోసం +95-95419602 నంబర్ ద్వారా సంప్రదించాలని సూచించారు.
భూకంప బాధితులకు సహాయం చేయడం మన మానవతా ధర్మమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘‘ఆపరేషన్ బ్రహ్మ’’ ద్వారా అవసరమైన సహాయాన్ని అందించేందుకు భారత్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.