Saturday, November 15, 2025
Homeనేషనల్Immigration : విమాన ప్రయాణికులకు పండగ కబురు.. ఎయిర్‌పోర్టుల్లో ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు పెంపు!

Immigration : విమాన ప్రయాణికులకు పండగ కబురు.. ఎయిర్‌పోర్టుల్లో ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు పెంపు!

Faster immigration clearance India : పండగ సీజన్‌లో సొంతూళ్లకు, విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే ఎయిర్‌పోర్టులలో గంటల తరబడి ఇమ్మిగ్రేషన్ క్యూ లైన్లలో నిరీక్షించే తిప్పలు ఇక  తప్పనున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆదేశించింది. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? దీనివల్ల ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి.?

- Advertisement -

పండగ రద్దీ.. కేంద్రం ముందస్తు చర్యలు : దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండగల నేపథ్యంలో విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ సమయంలో ఇమ్మిగ్రేషన్ వద్ద ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.

ఈ సమస్యను అధిగమించేందుకు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తగినన్ని అదనపు ఇమ్మిగ్రేషన్ కౌంటర్లను ఏర్పాటు చేయాలి.
అదనపు సిబ్బందిని నియమించి, 24 గంటల పాటు విధుల్లో ఉండేలా చూడాలి.

ఫాస్ట్ ట్రాక్’ ప్రోగ్రామ్‌కు మరింత ప్రాచుర్యం : సాధారణ ప్రయాణికులతో పాటు, ‘ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్- ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం’ (FTI-TTP)ను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని హోంమంత్రిత్వ శాఖ సూచించింది.

ఏమిటీ FTI-TTP : ఇది అమెరికాలోని ‘గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రాం’ను పోలి ఉంటుంది. దీని కింద ముందుగానే తమ వివరాలను నమోదు చేసుకుని, ధ్రువీకరించబడిన భారతీయ పౌరులు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డు హోల్డర్లకు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ నిమిషాల్లో పూర్తవుతుంది.

ప్రస్తుత లభ్యత: ప్రస్తుతం ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు సహా 13 ప్రధాన విమానాశ్రయాల్లో ఈ ఫాస్ట్ ట్రాక్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

లబ్ధిదారులు: ఇప్పటివరకు మూడు లక్షల మంది ఈ కార్యక్రమం కింద నమోదు చేసుకోగా, 2.65 లక్షల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. ప్రారంభంలో భారతీయ పౌరులు, OCI కార్డు హోల్డర్లకు ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. భవిష్యత్తులో దేశంలోని 21 ప్రధాన విమానాశ్రయాలకు ఈ పథకాన్ని విస్తరించనున్నారు.

పెరుగుతున్న ప్రయాణికులు : గతేడాది (2024) 12 లక్షల మందికి పైగా విదేశీ పౌరులకు భారత్ ఈ-వీసాలు జారీ చేసిందంటే, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులే. ఈ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా, విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, ప్రయాణికులకు వేగవంతమైన, సులభమైన, సురక్షితమైన ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad