Saturday, November 15, 2025
Homeనేషనల్INDIAalliance: ఇండియా కూటమిలో కుదుపు... గుడ్ బై చెప్పిన ఆమ్ ఆద్మీ!

INDIAalliance: ఇండియా కూటమిలో కుదుపు… గుడ్ బై చెప్పిన ఆమ్ ఆద్మీ!

AAP leaves INDIA alliance : కేంద్రానికి వ్యతిరేకంగా ఏర్పాటైన ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమిలో పెద్ద కుదుపులు ప్రారంభమయ్యాయి. ఒకే గొడుగు కిందకు వచ్చిన పార్టీలు ఒక్కొక్కటిగా పక్కకు జరగడంతో కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీసుకున్న నిర్ణయం, ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. అసలు కూటమిలో ఏం జరుగుతోంది..? కేవలం 2024 ఎన్నికల వరకే ఈ బంధం పరిమితమా..?

- Advertisement -

విపక్ష ‘ఇండియా’ కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గట్టి షాక్ ఇచ్చింది. శనివారం (జులై 19) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరగనున్న కూటమి ఎంపీల కీలక సమావేశానికి హాజరు కావడం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, కాంగ్రెస్ పెద్దలకు అధికారికంగా సమాచారం అందించారు. ఈ నిర్ణయంతో కూటమిలో చీలిక ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఎన్నికల వరకే మా బంధం: విలేకరులతో మాట్లాడిన సంజయ్ సింగ్, కూటమి భవిష్యత్తుపై తమ వైఖరిని కుండబద్దలు కొట్టారు. “‘ఇండియా’ కూటమి ఏర్పాటు కేవలం 2024 లోక్‌సభ ఎన్నికల కోసమే. ఆ లక్ష్యం పూర్తయింది. ఆ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కలిసికట్టుగా 240 స్థానాలు సాధించడం గొప్ప విజయమే,” అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల వ్యూహంపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ భేటీకి ఆప్ గైర్హాజరు కావడం, కూటమి నుంచి ఆ పార్టీ దాదాపుగా వైదొలిగినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆప్ బాటలోనే తృణమూల్: కేవలం ఆప్ మాత్రమే కాదు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కూడా ఈ సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. జులై 21న బెంగాల్‌లో జరిగే ‘షహీద్ దివస్’ కార్యక్రమాల ఏర్పాట్లలో ఎంపీలందరూ నిమగ్నమై ఉన్నందున హాజరు కాలేకపోతున్నామని టీఎంసీ తెలిపింది.

పంజాబ్ పంచాయితీ నుంచి దిల్లీ దాకా: కూటమితో ఆప్ అంటీముట్టనట్లు వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. ‘ఆపరేషన్ సిందూర్’పై ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కూటమి పార్టీలు ప్రధానికి రాసిన ఉమ్మడి లేఖపై ఆప్ సంతకం చేయలేదు. ఇక ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అక్కడ ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తమ మంత్రులపై బీజేపీతో కలిసి కాంగ్రెస్ కేసులు పెట్టిస్తోందని ఆప్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ రాజకీయ వైరం కొనసాగుతుండగానే, జాతీయ స్థాయిలో కలిసి నడవడం అసాధ్యమని ఆప్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు కుదరలేదని తెలిసిందే. రెండు పార్టీలు స్వతంత్రంగా బరిలోకి దిగాయి.

నితీశ్ కుమార్‌తో మొదలైన నిష్క్రమణల పర్వం, ఇప్పుడు ఆప్‌తో కొనసాగుతుండటంతో ‘ఇండియా’ కూటమి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad