దేశంలో మరోసారి కరోనా వైరస్ హావా స్పష్టమవుతోంది. కొత్తగా వెలుగులోకి వస్తున్న కేసుల సంఖ్య సామాన్య ప్రజలతో పాటు ఆరోగ్య శాఖలలోనూ ఆందోళనకు కారణమవుతోంది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 273 యాక్టివ్ కేసులు నమోదు కాగా, ఇది కేంద్ర ఆరోగ్యశాఖను కూడా చురుకుగా స్పందించాల్సిన పరిస్థితిలోకి నెట్టింది.
ఇటీవల తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల వైద్యశాఖలు మరింత అప్రమత్తమవుతూ, హాస్పిటళ్లలో ప్రత్యేక కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. పరీక్షల సంఖ్యను పెంచడమే కాకుండా, అవసరమైన చోట్ల కోవిడ్ నిబంధనలు తిరిగి అమలులోకి తెచ్చేందుకు కూడా యోచిస్తున్నాయి.
మహారాష్ట్రలో ఒకే రోజులో 66 యాక్టివ్ కేసులు నమోదవగా, తమిళనాడులో 55 కేసులు బయటపడ్డాయి. కర్నాటకలో 36, ఢిల్లీలో 23 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇది ప్రజలలో అప్రమత్తతను మరింత పెంచింది. ఈ సారి వ్యాపిస్తున్న వైరస్ రూపాలు గత కరోనావేరియంట్లకు భిన్నంగా ఉన్నప్పటికీ పెద్దగా ప్రమాదకరం కావని నిపుణులు చెబుతున్నారు. NB.1.8.1 మరియు LF.7 అనే వేరియంట్లు ప్రస్తుతం భారత్‌లో నమోదవుతున్నాయని, అయితే ఇవి తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశాలు తక్కువేనని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.
అయితే కొత్త కేసుల నమోదు నేపథ్యంలో ప్రజలలో భయభ్రాంతులు మొదలయ్యాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పటికే కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక కోవిడ్ వార్డులు సిద్ధం చేయగా, అవసరమైన ప్రదేశాల్లో పరీక్షా శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా భయపడాల్సిన పని లేదని, కానీ మాస్కులు, శానిటైజర్లు వంటి ప్రాథమిక జాగ్రత్తలు తప్పక పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.