India rejection of Epstein files claims : ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన అమెరికా కుబేరుడు, లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఉదంతం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో పెను తుఫానును సృష్టిస్తోంది. తాజాగా అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన సుమారు 30 లక్షల పేజీల రహస్య పత్రాలు ప్రపంచ దిగ్గజాల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. అయితే, ఈ ‘పాపాల పుట్ట’లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు కూడా ఉందన్న వార్త ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఈ నివేదికలపై భారత్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘ఉక్కు’లాంటి సమాధానం ఇచ్చింది.
విదేశాంగ శాఖ ‘ఘాటు’ స్పందన: అవి కేవలం ప్రేలాపనలే : ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ప్రధాని మోదీ ప్రస్తావన రావడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
నేరస్థుడి అవాకులు చవాకులు: భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేర్కొన్న అంశాలను పూర్తిగా తోసిపుచ్చారు. “ఒక లైంగిక నేరస్థుడిగా శిక్ష అనుభవించి, జైలులోనే మరణించిన వ్యక్తి రాసిన ఈ-మెయిల్‌లో ఉన్న విషయాలకు ఎటువంటి విలువ లేదు. అవి కేవలం ఒక నేరస్థుడి ‘చెత్త ప్రేలాపనలు’ మాత్రమే” అని ఆయన కుండబద్ధలు కొట్టారు.
వాస్తవానికి.. ఊహలకు మధ్య వ్యత్యాసం: 2017 జులైలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించిన మాట వాస్తవమని, అది ఒక చారిత్రాత్మక అధికారిక పర్యటన అని భారత్ స్పష్టం చేసింది. అయితే, ఆ పర్యటనను ఎప్‌స్టీన్ తన ఈ-మెయిల్‌లో ప్రస్తావించిన విధానం, ఇతర అభూతకల్పనలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇక్కడ కావాలనే అబద్ధాలను అల్లినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.
చారిత్రాత్మక పర్యటన నేపథ్యం: 1992లో ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత, ఆ దేశంలో అడుగుపెట్టిన మొదటి భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆ పర్యటన ఇరు దేశాల రక్షణ, వ్యవసాయ రంగాల్లో నవశకాన్ని ప్రారంభించింది. అటువంటి పవిత్రమైన దౌత్య ప్రయాణాన్ని ఒక నేరస్థుడి సంభాషణలతో ముడిపెట్టడాన్ని భారత్ సహించలేకపోతోంది.
30 లక్షల పేజీల ‘చిట్టా’.. అసలేం జరిగింది : అమెరికాలో ఇటీవల రూపొందించిన “ఎప్‌స్టీన్ ఫైల్స్ ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్” ప్రకారం, ప్రభుత్వం వద్ద ఉన్న రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయడం తప్పనిసరి అయ్యింది. తాజాగా విడుదల చేసిన సమాచారంలో 30 లక్షల పేజీల పత్రాలు, 2,000 కంటే ఎక్కువ వీడియోలు, లక్షా 80 వేల చిత్రాలు ఉన్నాయి. అమెరికాలోని రాజకీయ వర్గాల ఒత్తిడితో ఈ వివరాల వెల్లడి జరిగింది. ఇందులో ఎప్‌స్టీన్ సహచరురాలు ఘిస్లేన్ మాక్స్‌వెల్‌కు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి.

