Friday, February 13, 2026
Homeనేషనల్Free Trade : వాణిజ్య ఒప్పందం.. భారత్-ఈయూ బంధంపై అన్నదాతల రణగళం

Free Trade : వాణిజ్య ఒప్పందం.. భారత్-ఈయూ బంధంపై అన్నదాతల రణగళం

India-EU Free Trade Agreement Impact : భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో మమేకమవ్వాలని చూస్తోంది సరే.. కానీ ఆ ప్రయాణం స్వయంసమృద్ధిని పణంగా పెట్టి సాగాల్సిందేనా? యూరోపియన్ యూనియన్ (EU)తో భారత్ కుదుర్చుకోబోతున్న ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ (FTA) ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. దీనిని కేవలం ఒక వాణిజ్య ఒప్పందంగా కాకుండా, దేశీయ వ్యవసాయాన్ని, పరిశ్రమలను చిన్నాభిన్నం చేసే “ఆర్థిక వలసవాద నమూనా”గా రైతు సంఘాలు అభివర్ణిస్తున్నాయి. విదేశీ కార్పొరేట్ శక్తులు మన మార్కెట్‌ను ఆక్రమించుకునేందుకు ప్రభుత్వం ఎర్ర తివాచీ పరుస్తోందా? 

- Advertisement -

ఆర్థిక వలసవాదానికి అడుగులు: సంయుక్త కిసాన్ మోర్చా హెచ్చరిక ::భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రైతు సంఘాల ఐక్య వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (SKM) శుక్రవారం ఒక ఘాటు ప్రకటన విడుదల చేసింది. 

సుంకాల కోత – దేశీయ ఉత్పత్తిపై దెబ్బ: విదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వం భారీగా దిగుమతి సుంకాలను  తగ్గించడంపై ఎస్కేఎం విస్తుపోతోంది. ఆలివ్ ఆయిల్, మార్గరిన్, ఇతర కూరగాయల నూనెలు, పండ్ల రసాలు, నాన్-ఆల్కహాలిక్ బీర్ వంటి వాటిపై సుంకాన్ని పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని పేర్కొంది. ఇది దేశీయంగా పండించే పంటల ధరలను పాతాళానికి పడిపోయేలా చేస్తుందని రైతు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శుద్ధి చేసిన ఆహారం.. చిన్న రైతులకు ‘శాపం’: బ్రెడ్, పేస్ట్రీలు, బిస్కెట్లు, పాస్తా, చాక్లెట్లు, పెంపుడు జంతువుల ఆహారం  వంటి ‘శుద్ధి చేసిన ఆహార పదార్థాల’  మార్కెట్‌ను పూర్తిగా విదేశీయులకు తెరిచివేయడం అత్యంత ప్రమాదకరమని ఎస్కేఎం హెచ్చరించింది. “కంచే చేను మేసిన చందంగా”, ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాలు దేశీయ ఆహార శుద్ధి పరిశ్రమను కుప్పకూల్చి, కోట్లాది మంది ఉపాధిని దెబ్బతీస్తాయని మండిపడింది.

మద్యం, మాంసం ఉత్పత్తులపై రాయితీలు : ఒప్పందంలో భాగంగా మద్యంపై సుంకాలను ప్రభుత్వం భారీగా తగ్గించింది:
వైన్ (Wine): 150 శాతం నుంచి 20-30 శాతానికి కోత.
స్పిరిట్స్ (Spirits): 150 శాతం నుంచి 40 శాతానికి తగ్గింపు.
బీర్ (Beer): 110 శాతం నుంచి 50 శాతానికి తగ్గింపు.
పండ్లు (కివీ, పియర్స్): 33 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు.
మాంసం ఉత్పత్తులు: 110 శాతం నుంచి 50 శాతానికి సుంకాలు తగ్గించడం వల్ల దేశీయ పశుపోషకులు నష్టపోతారని ఎస్కేఎం స్పష్టం చేసింది.

కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి భారత మార్కెట్ : “ముందు నుయ్యి వెనుక గొయ్యి” అన్నట్లుగా ఉన్న ఈ ఒప్పందం వల్ల భారతీయ మార్కెట్ వ్యవస్థీకృతంగా విదేశీ కార్పొరేట్ కంపెనీల వశమవుతుందని ఎస్కేఎం విమర్శించింది. ఉపాధి అవకాశాలు మృగ్యమై, చిన్న రైతులు కూలీలుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News