Homeనేషనల్Petroleum : బంకుల్లో బల్క్ ‘షాక్’.. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం ఆంక్షల పగ్గాలు!

Petroleum : బంకుల్లో బల్క్ ‘షాక్’.. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం ఆంక్షల పగ్గాలు!

Industrial fuel purchase restrictions India : పశ్చిమాసియా రణరంగంలో యుద్ధ జ్వాలలు అంతకంతకూ ఎగిసిపడుతుండటం, అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’ మూతపడటంతో ముడి చమురు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ సంక్షోభం సృష్టించిన సెగలు భారత ఇంధన మార్కెట్‌ను తాకాయి. ఈ నేపథ్యంలో సామాన్య వినియోగదారులకు ఇంధన కొరత రాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు ఎవరూ కూడా రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర పెట్రోలియం శాఖ తక్షణ నిషేధం విధించింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో ఓపెన్ మార్కెట్ ధరలు ఆకాశాన్నంటాయి. దేశీయంగా బల్క్ మార్కెట్ (పరిశ్రమలు, టెలికాం టవర్లు, భారీ పవర్ జనరేటర్లు వాడే విభాగం) కు, సాధారణ రిటైల్ బంకుల్లో విక్రయించే ధరలకు మధ్య అగాధం ఏర్పడింది.

ఢిల్లీ మార్కెట్ ధరల వ్యత్యాసం: ఢిల్లీలోని పెట్రోల్ బంకుల్లో లీటరు డీజిల్ ధర రూ. 95.20 గా ఉంటే, అదే డీజిల్‌ను బల్క్ సప్లయర్స్ ద్వారా కొనుగోలు చేస్తే లీటరుకు రూ. 134.50 పలుకుతోంది.

రూ. 40 మేర తేడా: లీటరుకు దాదాపు రూ. 40 వరకు వ్యత్యాసం ఉండటంతో పరిశ్రమలు, కమర్షియల్ సంస్థలు తమ సొంత బల్క్ నెట్‌వర్క్‌ను వదిలేసి, రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి భారీ ఎత్తున ఇంధనాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించాయి. దీంతో ఒక్కసారిగా రిటైల్ అవుట్‌లెట్లలో డీజిల్‌కు ‘అసాధారణ డిమాండ్’ ఏర్పడి స్థానిక కొరతకు దారితీసే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీ (IOC), బీపీసీఎల్ (BPCL), హెచ్‌పీసీఎల్ (HPCL) బంకుల్లో మే నెలలోనే పెట్రోల్ అమ్మకాలు 4.8 శాతం, డీజిల్ అమ్మకాలు 6.4 శాతం మేర పెరగడం ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

కేంద్రం జారీ చేసిన ‘కీలక ఆదేశాలు’ ఇవే: కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ‘మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజిల్ (టెంపరరీ రెగ్యులేషన్ ఆఫ్ సప్లై త్రూ రిటైల్ అవుట్‌లెట్స్) ఆర్డర్, 2026’ ప్రకారం కింది నిబంధనలు తక్షణమే అమలులోకి వచ్చాయి.

బల్క్ వినియోగదారులపై నిషేధం : పరిశ్రమలు, వాణిజ్య అవసరాలు, సంస్థాగత వినియోగదారులు (Industrial & Commercial Users) పెట్రోల్ బంకుల్లో ఇంధనం కొనడం పూర్తిగా నిషిద్ధం. వారు తమకు కావలసిన కోటాను కేవలం అధీకృత బల్క్ సప్లై చైన్ల ద్వారానే పొందాలి.

గరిష్టంగా 200 లీటర్లు : రిటైల్ పెట్రోల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక కస్టమర్‌కు రోజుకు గరిష్టంగా 200 లీటర్ల కంటే ఎక్కువ డీజిల్ విక్రయించకూడదు.

పునర్‌విక్రయంపై ఉక్కుపాదం : బంకుల్లో కొనుగోలు చేసిన డీజిల్‌ను లాభాల కోసం బయట ఇతరులకు రీసేల్ (పునర్‌విక్రయం) చేయడానికి వీల్లేదు. కేవలం అనుమతించబడిన కంటైనర్లలో లేదా వాహనాల ట్యాంకుల్లో మాత్రమే ఇంధనాన్ని నింపాలి.

90 రోజుల కాలపరిమితి : ఈ తాత్కాలిక ఆంక్షలు ప్రాథమికంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటాయి. అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయ ఇంధన నిల్వలను సమీక్షించిన తర్వాత అవసరమైతే ఈ గడువును మరికొంత కాలం పొడిగిస్తారు.

బ్లాక్ మార్కెటింగ్‌పై నిఘా.. రాష్ట్రాలకు ఆదేశాలు : ధరల వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేయడం (Hoarding), బ్లాక్ మార్కెటింగ్ చేయడం, రూట్ మళ్లించడం (Diversion) వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ (Essential Commodities Act) కింద ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.

సామాన్యులకు ఊరట: ఈ ఆంక్షల వల్ల సొంత కార్లు, ద్విచక్ర వాహనాలు కలిగిన సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సాధారణ కార్ల ట్యాంక్ కెపాసిటీ 35-60 లీటర్లు, బైకుల కెపాసిటీ 8-14 లీటర్లు మాత్రమే ఉండటం వల్ల 200 లీటర్ల పరిమితి సామాన్యులను తాకదు. అయితే భారీ అంతరాష్ట్ర లారీలు, ప్రైవేటు లగ్జరీ బస్సుల ఆపరేటర్లు రోజువారీ లాంగ్ జర్నీల సమయంలో ప్రణాళికలు మార్చుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News