Trade deal with UK: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన యూకేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కీలకమైన వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల అధినేతలు సంతకం చేశారు. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌తో చెకర్స్ ఎస్టేట్‌లో జరిగిన సమావేశంలో భారత్-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ – FTA) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. ముఖ్యంగా కొన్ని ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను భారీగా తగ్గించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
ఈ ఒప్పందంతో బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే ఆల్కహాల్ ఉత్పత్తులపై భారత్ విధించే సుంకాలు గణనీయంగా తగ్గనున్నాయి. ప్రస్తుతం స్కాచ్, విస్కీ, జిన్ లాంటి మద్యం ఉత్పత్తులపై 150 శాతం దిగుమతి సుంకం వసూలవుతున్నది. అయితే ఈ ఒప్పందంతో ఆ సుంకాన్ని 75 శాతానికి తగ్గించనున్నారు. ఇది హైఎండ్ ఆల్కహాలిక్ ఉత్పత్తులు కొనే వారికి గణనీయమైన ఉపశమనం కలిగించనుంది.
అలాగే, బ్రిటన్‌లో తయారయ్యే లగ్జరీ కార్లపై కూడా దిగుమతి సుంకం తగ్గనుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో 100 శాతం దిగుమతి సుంకంతో అమ్ముడయ్యే జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి కార్లపై ఇకపై కేవలం 10 శాతం మాత్రమే సుంకం విధించనున్నారు. దీని వల్ల లగ్జరీ కార్ల ధరలు కొంత మేరకు తగ్గుతాయని భావిస్తున్నారు. ఇది కార్ల దిగుమతిదారులకు, వినియోగదారులకు అనుకూలమైన పరిణామంగా అభివర్ణించవచ్చు. ఫ్రీ ట్రేడ్ ఒప్పందం ప్రభావం కేవలం మద్యం లేదా కార్లపైనే కాకుండా ఇతర అనేక రంగాలపైనా పడనుంది. ముఖ్యంగా వైద్య పరికరాలు, ఎలక్ట్రిక్ మెషినరీ, ఆహార పదార్థాలు, సౌందర్య లేపనాలు, క్రీములు వంటి బ్రిటన్‌లో తయారయ్యే ఉత్పత్తుల ధరలు భారత మార్కెట్లో తగ్గే అవకాశముంది. దిగుమతి సుంకాల తగ్గింపుతో వీటి అందుబాటుతో పాటు వినియోగ మరింత పెరిగే అవకాశముంది.
మొత్తంగా ఈ ఒప్పందం ద్వారా భారత్-యూకే సంబంధాలు మరింత బలపడటమే కాకుండా, భారత వినియోగదారులకు నేరుగా లాభాలు చేకూరే అవకాశముంది. ఇది రెండు దేశాల ఆర్థిక సంబంధాల్లో కీలక మైలురాయిగా నిలిచే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


