Indian Army denies ceasefire violation : నియంత్రణ రేఖ వద్ద మళ్లీ తుపాకుల గర్జన..! ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత తొలిసారిగా పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ మంగళవారం రాత్రి వార్తలు గుప్పుమన్నాయి. పూంచ్ సెక్టార్‌లో దాయాది సైన్యం కాల్పులకు తెగబడగా, భారత బలగాలు దీటుగా బదులిచ్చాయని జాతీయ మీడియా కోడై కూసింది. ఈ వార్తలతో సరిహద్దుల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కానీ, ఈ కాల్పుల మోతలో నిజమెంత..? దాయాది దేశం నిజంగానే కవ్వింపు చర్యలకు పాల్పడిందా..? లేక ఇదంతా వట్టి ప్రచారమా..? భారత సైన్యం అధికారికంగా ఏం చెప్పింది..?
వదంతుల వల : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత, మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మంగళవారం రాత్రి పూంఛ్ జిల్లాలోని మన్‌కోట్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడిందని వార్తలు వ్యాపించాయి. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ కాల్పులు జరిగాయని, ఇరుదేశాల మధ్య దాదాపు 15 నిమిషాల పాటు కాల్పులు కొనసాగాయని వివిధ జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో సరిహద్దు గ్రామాల్లో ఆందోళన నెలకొంది.
స్పందించిన సైన్యం.. ఫుల్‌స్టాప్ పెట్టిన ప్రకటన : ఈ వదంతులు శరవేగంగా వ్యాపిస్తున్న తరుణంలో భారత సైన్యం రంగంలోకి దిగింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పింది. కాల్పుల విరమణ ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
“పూంచ్ ప్రాంతంలో కాల్పుల విరమణ ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని సామజిక మాధ్యమాలల్లో వార్తలు ప్రచారమవుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి కాల్పుల విరమణ ఉల్లంఘన జరగలేదని.. ప్రభుత్వం ధ్రువీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దు” అని భారత సైన్యం స్పష్టతనిచ్చింది. దీంతో ఈ వదంతులకు తెరపడినట్లయింది.
డీజీఎంవోల పాత్ర కీలకం : గతంలో పహల్గాం దాడి తర్వాత నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతలు పెరిగినప్పుడు, పాకిస్థానే చొరవ తీసుకుని ఉద్రిక్తతలు తగ్గించాలని కోరింది. ఆ సమయంలో ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) స్థాయి అధికారులు హాట్‌లైన్‌లో చర్చలు జరిపి ఒప్పందానికి వచ్చారు. రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు, ఈ డీజీఎంవోల మధ్య జరిగే సంప్రదింపులే ఉద్రిక్తతలను చల్లార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుత వదంతుల నేపథ్యంలో కూడా సైన్యం వెంటనే స్పందించి వాస్తవాన్ని వెల్లడించడం గమనార్హం.


