న్యూఢిల్లీ, నవంబర్ 2 (తెలుగు ప్రభ): భారత పునరుత్పాదక ఇంధన రంగం భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. గత రెండేళ్లలోనే ఈ రంగంలోకి ఏకంగా 67 బిలియన్ డాలర్ల (సుమారు రూ.5.6 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చాయని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం వెల్లడించారు. ఒకే రంగంలోకి ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు రావడం దేశ చరిత్రలోనే అత్యంత పెద్ద పరిణామమని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలో జరిగిన ‘భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమిట్ అండ్ ఎక్స్‌పో 2026’లో పాల్గొన్న ఆయన, పునరుత్పాదక ఇంధన రంగంలో సాధించిన ప్రగతిని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ శిలాజేతర ఇంధన ఉత్పత్తి సామర్థ్యం గత రెండేళ్లలోనే 50 శాతానికి పైగా పెరిగిందన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, దేశ వృద్ధి రేటు అంచనాలను పలు అంతర్జాతీయ సంస్థలు 7 శాతం వరకు సవరించాయని గుర్తుచేశారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని ప్రపంచ పెట్టుబడిదారులకు జోషి పిలుపునిచ్చారు.
సౌర, పవన విద్యుత్ రంగాల్లో ప్రగతి
2014లో 2.8 గిగావాట్లుగా ఉన్న సౌర విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం 171 గిగావాట్లకు చేరింది. పవన విద్యుత్ సామర్థ్యం 21 గిగావాట్ల నుంచి 60 గిగావాట్లకు పెరిగింది. సోలార్ మాడ్యూళ్ల ఉత్పత్తి సామర్థ్యం 2 గిగావాట్ల నుంచి 225 గిగావాట్లకు చేరగా, సోలార్ సెల్స్ తయారీ సామర్థ్యం 2014లో సున్నా నుంచి ప్రస్తుతం 45 గిగావాట్లకు పెరిగింది. విండ్ టర్బైన్ల తయారీ సామర్థ్యం కూడా 10 గిగావాట్ల నుంచి 24 గిగావాట్లకు చేరింది. ఈ అభివృద్ధి కారణంగా వినియోగదారులకు తక్కువ ధరలకే హరిత విద్యుత్‌ను అందించడంలో భారత్ పురోగతి సాధించిందని మంత్రి తెలిపారు. 2014లో యూనిట్ సోలార్ విద్యుత్ ధర రూ.5.50గా ఉండగా, ప్రస్తుతం రూ.2.15కు తగ్గిందన్నారు. సోలార్, బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.2.70గా ఉందని వివరించారు.
గ్రీన్ హైడ్రోజన్‌లోనూ ముందడుగు
ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు గ్రీన్ హైడ్రోజన్‌ను కిలో రూ.279కు, గ్రీన్ అమ్మోనియాను కిలో రూ.49.75కు అందించే స్థాయికి భారత్ చేరుకుందని మంత్రి జోషి తెలిపారు. ఈ ఏడాది భారతీయ కంపెనీలు 4 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా కోసం 18 ఒప్పందాలపై సంతకాలు చేశాయని వెల్లడించారు. 2023లో ప్రారంభించిన ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’ కింద కుదిరిన ఒప్పందాల్లో 70 శాతానికి పైగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు కేటాయించారని తెలిపారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ద్వారా దేశంలోకి సుమారు రూ.90 వేల కోట్ల (9.5 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు రానున్నాయని ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.

